ఉపాధ్యాయులకు కొవిడ్‌ కేంద్రాల్లో విధులా?.. ఇది ప్రభుత్వ మూర్ఖత్వానికి పరాకాష్ఠ: నాదెండ్ల మనోహర్‌

  • ప్రజల ఆరోగ్యం పట్ల జగన్‌కు బాధ్యత లేదు
  • కొవిడ్‌ ఉద్ధృతిలో పరీక్షలేంటి?
  • ఉపాధ్యాయులు, విద్యార్థుల జీవితాలను ముప్పులోకి నెడుతున్నారు
  • వెంటనే పరీక్షలను రద్దు చేయాలి
  • ప్రభుత్వంపై జనసేన నేత మనోహర్‌ మండిపాటు
ప్రజల ఆరోగ్యం పట్ల ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి ఏమాత్రం బాధ్యత లేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌ విజృంభిస్తున్న తరుణంలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, విద్యార్థులు, తల్లిదండ్రుల వినతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఇది ప్రభుత్వ మూర్ఖత్వానికి పరాకాష్ఠ అని మండిపడ్డారు.

విద్యార్థుల యోగక్షేమాల గురించి ఏమాత్రం ఆటోచించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను కొవిడ్‌ కేంద్రాల్లో విధులకు పంపిందని మనోహర్‌ ఆరోపించారు. దీన్ని మూర్ఖపు చర్యగా అభివర్ణించిన ఆయన జనసేన పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తోందన్నారు. పదో తరగతి విద్యార్థులకు ఇప్పటికీ తరగతులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రతి విద్యార్థికి మాస్కులు అందజేసి షెడ్యూల్‌ ప్రకారమే పరీక్షలు జరపుతామని ఏపీ విద్యాశాఖ మంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దీన్ని బట్టి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై ప్రభుత్వానికి ఏమాత్రం శ్రద్ధ లేదన్న విషయం అర్థమవుతోందన్నారు.

పదో తరగతి, ఇంటర్నీడియట్‌కు చెందిన దాదాపు 16.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉందని మనోహర్‌ తెలిపారు. కొవిడ్‌ కేంద్రాల వద్ద విధులు నిర్వహించిన ఉపాధ్యాయులే పాఠాలు చెప్పడం, తిరిగి పరీక్షలు నిర్వహించడం వల్ల తీవ్ర ముప్పని వివరించారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబాలను ప్రభుత్వమే కరోనా ముప్పు ముంగిట నిలబెడుతోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీబీఎస్‌ఈ తరహాలోనే ఏపీలోనూ పరీక్షలు రద్దు చేయాలని కోరారు.


More Telugu News