ఎలాంటి ఇబ్బందులు లేకుండా పది, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తాం: బొత్స

  • ఏపీలో కరోనా స్వైరవిహారం
  • తీవ్ర చర్చనీయాంశంగా మారిన పబ్లిక్ పరీక్షలు
  • 2 వేల మంది వైద్య సిబ్బందిని నియమించామన్న బొత్స
  • అవసరమైతే ఇంకా నియమిస్తామని వెల్లడి
  • కరోనా కట్టడికి అనేక చర్యలు తీసుకుంటున్నామని వివరణ
ఏపీలో కరోనా బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో పది, ఇంటర్ పరీక్షల నిర్వహణ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పరీక్షలు నిలిపివేయాలని విపక్షాలు పట్టుబడుతుండగా, నిర్వహించి తీరుతామని సర్కారు చెబుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ అంశంపై స్పందించారు. పబ్లిక్ పరీక్షల నిర్వహణపై వెనుకంజ వేసేది లేదని పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. నిన్ననే కొత్తగా 2 వేల మంది వైద్య సిబ్బందిని తీసుకున్నామని, అవసరమైతే మరింతమంది వైద్య సిబ్బందిని నియమిస్తామని చెప్పారు.

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై స్పందిస్తూ, కరోనా కట్టడికి అనేక చర్యలు తీసుకుంటున్నామని బొత్స తెలిపారు. ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ లభ్యత, ఔషధాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి సమీక్షిస్తున్నామని పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో బెడ్లను 50 వేలకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం దేశం, రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని, రాజకీయాలకు అతీతంగా అందరూ చేయూతనివ్వాలని అన్నారు.

విజయనగరం ఘటనపై వివరణ ఇస్తూ, ఆక్సిజన్ కొరతతో విజయనగరం జిల్లాలో ఎవరూ మరణించలేదని బొత్స స్పష్టం చేశారు. అధికారులు రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించి ప్రాణాలు కాపాడారని వివరించారు. ఆక్సిజన్ ఉత్పత్తి చేసి సరఫరా చేయాలని పరిశ్రమలను ఆదేశించామని, విశాఖ ఉక్కు పరిశ్రమలోని రెండు ఆక్సిజన్ ప్లాంట్ ల వినియోగానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.


More Telugu News