జగన్ గారూ మీకు చేతులెత్తి మొక్కుతున్నాం... ప్రజల ప్రాణాలు కాపాడండి: సోమిరెడ్డి

  • రాష్ట్రంలో తీవ్ర పరిస్థితులు ఏర్పడ్డాయన్న సోమిరెడ్డి
  • విజయనగరం ఘటన దురదృష్టకరమని వెల్లడి
  • ఇలాంటిదే రేపు ఎక్కడైనా జరగొచ్చని వ్యాఖ్యలు
  • సీఎం జగన్ అత్యవసరంగా స్పందించాలని విజ్ఞప్తి
విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక కరోనా రోగులు మృతి చెందారన్న వార్తలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. రాజకీయాల గురించి కాకుండా... పేద, మధ్య తరగతి ప్రజల ప్రాణాల గురించి, ఆరోగ్యం గురించి ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. విజయనగరం ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇవాళ విజయనగరంలో జరిగింది, రేపు మరొక చోట జరుగుతుంది... ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగింది అని ఆరోపించారు.

ప్రభుత్వం వెంటనే ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులను విడుదల చేసి, వచ్చినవాళ్లను వచ్చినట్టు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించండి అని చెప్పి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు అని సోమిరెడ్డి వెల్లడించారు. కరోనా సెకండ్ వేవ్ గురించి, రాష్ట్రంలో అదనపు మౌలిక సదుపాయాల గురించి కనీసం అరగంటైనా ఆలోచించారా? అని సీఎం జగన్ ను ప్రశ్నించారు.

"మీకు ఓట్లేసి మిమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజల ప్రాణాలను మీరే తీస్తున్నారు... ఇది క్షమించరాని నేరం. రాష్ట్రంలో ఎప్పుడూ లేనివిధంగా తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ జగన్ గారూ మీకు చేతులెత్తి మొక్కుతున్నాం... అత్యవసరంగా స్పందించి ప్రజల ప్రాణాలు కాపాడండి. ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో గమనించి వాటిలో ఏది మెరుగైనదో వాటిని మన రాష్ట్రంలోనూ అమలు చేయండి" అని వ్యాఖ్యానించారు.


More Telugu News