నయనతారతో 'మాతృదేవోభవ' రీమేక్?

  • మరిచిపోలేని సినిమా 'మాతృదేవోభవ'
  • రీమేక్ ఆలోచనలో కేఎస్ రామారావు
  • నయనతార పైనే ఆయన దృష్టి

అమ్మ ప్రేమలోని గొప్పతనాన్ని అడుగడుగునా చాటిచెప్పిన చిత్రం 'మాతృదేవోభవ'. మాధవి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాను కేఎస్ రామారావు నిర్మించగా అజయ్ కుమార్ దర్శకత్వం వహించాడు. 1991లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకోని ప్రేక్షకులు లేరు. అంతగా ప్రేక్షకులను కదిలించిన కథ ఇంతవరకూ మళ్లీ రాలేదు. 'అమ్మ' అనే రెండు అక్షరాలకు ఎంతటి బలమైన సెంటిమెంట్ ఉంటుందనే విషయాన్ని ఈ సినిమా చాటి చెప్పింది. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి నిర్మాత కేఎస్ రామారావు మాట్లాడారు.

"ఈ తరం ప్రేక్షకులకు 'మాతృదేవోభవ' వంటి కథను పరిచయం చేయవలసిన అవసరం ఉంది. అందుకోసం ఆ సినిమాను రీమేక్ చేయాలనిపిస్తూ ఉంటుంది. దర్శకుడు అజయ్ కుమార్ తోను ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూనే ఉంటాను. ఈ తరం కథానాయికలలో నయనతార .. అనుష్క .. కీర్తి సురేశ్ వంటి వారితో ఈ సినిమా చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా నయనతార ఈ తరహా పాత్రలను బాగా చేస్తుంది. ఆ పాత్రను ఆమె చేస్తే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కానీ నయనతార తీసుకునే పారితోషికం చాలా ఎక్కువ .. అందువలన ఆమెతో చేయడం కష్టమేనేమో" అని చెప్పుకొచ్చారు. కానీ కథ వింటే నయనతార పారితోషికాన్ని గురించి పెద్దగా పట్టించుకోకపోవచ్చనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.



More Telugu News