భారత్‌కు అమెజాన్ సాయం.. విమానాల్లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు

  • భారత్‌లో ఆక్సిజన్‌కు తీవ్ర కొరత
  • వివిధ సంస్థలు, ఎన్జీవోలతో చేతులు కలిపిన అమెజాన్
  • సంక్షోభ సమయంలో భారత్ వెన్నంటే ఉంటామన్న ఈ-కామర్స్ దిగ్గజం
భారత్‌లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉండడంతో ప్రభుత్వానికి సాయం చేసేందుకు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ముందుకొచ్చింది. వివిధ పారిశ్రామిక భాగస్వాములు, ఎన్‌జీవోలతో చేతులు కలిపిన అమెజాన్ 10 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, బైలెవల్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజర్ (బీఐపీఏపీ) మెషీన్లు భారత్‌కు త్వరితగతిన తరలించేందుకు సిద్ధమైంది. 8 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 500 బీఐపీఏపీలను సింగపూర్ నుంచి వాయుమార్గంలో భారత్‌కు తరలించేందుకు ఏసీటీ గ్రాంట్స్, టెమాసెక్ ఫౌండేషన్, పూణె ప్లాట్‌ఫామ్ ఫర్ కొవిడ్-19 రెస్పాన్స్ (పీపీసీఆర్), ఇతర భాగస్వాములతో అమెజాన్ చేతులు కలిపింది.  

వీటిని భారత్‌కు వీలైనంత త్వరగా తరలించేందుకు ఆయా సంస్థలన్నీ భారత్‌తో కలిసి పనిచేస్తున్నాయి. కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రులు, పబ్లిక్ ఇనిస్టిట్యూషన్స్‌కు వీటిని విరాళంగా ఇవ్వనున్నారు. దేశంలో కరోనా ప్రభావం ఊహించడానికి  వీలులేనంతగా ఉందని, ఈ నేపథ్యంలో తాము భారత్‌ వెంటే ఉంటామని అమెజాన్ ఇండియా గ్లోబల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఇండియా హెడ్ అమిత్ అగర్వాల్ తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన సాయం అందిస్తామని స్పష్టం చేశారు.


More Telugu News