30 లక్షల కొవిషీల్డ్‌ డోసులను ఆర్డర్‌ చేయనున్న పంజాబ్‌!

  • ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సీఎం ఆదేశాలు
  • 3వ దశ వ్యాక్సినేషన్‌ కోసమని వెల్లడి
  • పేదవారి వ్యాక్సినేషన్‌ అవసరాల కోసం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నిధులు
  • సీఎస్‌ఆర్‌ నుంచి నిధులు సేకరించాలని ఆదేశం
  • వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో వివిధ సంస్థల మద్దతు కోరిన సీఎం
30 లక్షల కొవిషీల్డ్‌ కరోనా టీకా డోసులను ఆర్డర్‌ చేయాలని పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌ సింగ్‌ అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఆదేశించారు. మే 1 నుంచి ప్రారంభం కానున్న 18-45 ఏళ్ల వయసు వారి వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి వీటిని ఉపయోగించాలని తెలిపారు. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న 45 ఏళ్ల పైబడిన వారి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని ఆదేశించారు.

పేదవారి వ్యాక్సినేషన్‌ అవసరాల కోసం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నిధులతో పాటు, కార్పొరేట్‌ సోషల్‌ రెస్సాన్సిబిలిటీ కింద నిధులు సేకరించి ఉపయోగించాలని యంత్రాంగాన్ని అమరీందర్‌ సింగ్‌ ఆదేశించారు. అలాగే ఈఎస్‌ఐ పథకం కింద నమోదైన పారిశ్రామిక కార్మికులు, ఇతర సిబ్బందికి అందించే వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో ఈఎస్‌ఐసీ.. భవన నిర్మాణ కార్మికులకు అందించే టీకా కార్యక్రమంలో ‘బోర్డ్ ఫర్‌ వెల్ఫేర్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌’ సహకారం అందించాలని కోరారు.

మరోవైపు పంజాబ్‌లోనూ ఆక్సిజన్‌ కొరత ఆందోళన కలిగిస్తోంది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఆక్సిజన్‌ కోసం అత్యవసర సందేశం పంపింది. ఢిల్లీ సహా పొరుగు రాష్ట్రాల నుంచి బాధితుల తాకిడి ఎక్కువ కావడంతో ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌కు డిమాండ్‌ విపరీతంగా పెరిగిందని తెలిపింది.


More Telugu News