మీరు చేయగలిగిన సాయం చేయండి... పారిశ్రామికవేత్తలకు కేజ్రీవాల్‌ లేఖ

  • ఢిల్లీలో కొనసాగుతున్న ఆక్సిజన్‌ కొరత
  • ఇప్పటికే పదుల సంఖ్యలో మరణాలు
  • సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు ముమ్మరం
  • నిన్న అన్ని రాష్ట్రాల సీఎంలకు కేజ్రీవాల్‌ లేఖ
  • నేడు పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి
దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్‌ కొరత ఇంకా వేధిస్తోంది. అనేక ఆసుపత్రులు ప్రాణవాయువు కొరతతో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే పలు ప్రముఖ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ అందక పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం ఆక్సిజన్‌ కోసం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు సీఎం కేజ్రీవాల్‌ లేఖ రాశారు. వీలైనంత త్వరగా ఆక్సిజన్‌ పంపాలని విజ్ఞప్తి చేశారు.

తాజాగా కేజ్రీవాల్‌ పారిశ్రామికవేత్తలకు సైతం లేఖ రాశారు. ‘‘మాకు అండగా నిలిచేందుకు మీకు సాధ్యమైన సాయం చేయండి’’ అని విజ్ఞప్తి చేశారు. టాటా, బిర్లా, అంబానీ, హిందుజా, మహేంద్రతో పాటు దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలందరికీ కేజ్రీవాల్‌ లేఖ రాసినట్లు సమాచారం. మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరాను వేగవంతం చేసేందుకు సాయం చేయాలని సీఎం కోరారు.

ఆక్సిజన్‌ సరఫరా కోసం 24 క్రయోజనిక్‌ కంటైనర్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటామని ఇప్పటికే టాటా గ్రూప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే, ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ సైతం లిండే ఇండియాతో కలిసి ఆక్సిజన్‌ కంటైనర్లను దిగుమతి చేసుకుంటామని ప్రకటించింది.


More Telugu News