ఆఖరి ఓవర్లో జడేజా సిక్సర్ల వాన... చెన్నై భారీ స్కోరు

  • ఐపీఎల్ లో చెన్నైతో బెంగళూరు ఢీ
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై
  • 20 ఓవర్లలో 4 వికెట్లకు 191 రన్స్
  • 28 బంతుల్లో 62 పరుగులు చేసిన జడేజా
  • ఆఖరి ఓవర్లోనే 37 పరుగులు బాదిన వైనం
క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయడం చాలా కష్టం. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 19వ ఓవర్ ముగిసేసరికి చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 4 వికెట్లకు 154 పరుగులు. కానీ 20వ ఓవర్ ముగిసేసరికి ఆ జట్టు స్కోరు 191 పరుగులకు చేరుకుంటుందని ఎవరైనా ఊహించగలరా! కానీ, రవీంద్ర జడేజా వంటి చిచ్చరపిడుగు క్రీజులో ఉంటే ఇలాంటి అద్భుతాలే జరుగుతాయి. హర్షల్ పటేల్ విసిరిన ఆ ఓవర్లో జడేజా సిక్సర్ల మోత మోగించాడు. తొలుత వరుసగా 4 బంతుల్లో 4 భారీ సిక్సులు బాదిన జడ్డూ ఆ తర్వాతి బంతికి డబుల్ తీశాడు. ఆపై వరుసగా మరో సిక్స్, మరో ఫోర్ బాది మొత్తం ఓ ఓవర్లో 37 పరుగులు రాబట్టాడు. ఓ మోస్తరు స్కోరుతో సరిపెట్టుకుంటుందని భావించిన చెన్నైకి భారీ స్కోరు అందించాడు.

ముంబయి వాంఖెడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్ (50), రుతురాజ్ గైక్వాడ్ (33) తొలివికెట్ కు 74 పరుగులు జోడించి శుభారంభం అందించారు. రైనా 18 బంతుల్లో 3 సిక్సులు, ఒక ఫోర్ తో 24 పరుగులు చేయగా, రాయుడు 14 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా రాకతో స్కోరుబోర్డు ఊపందుకుంది. జడేజా మొత్తం 28 బంతులాడి 5 సిక్సులు, 4 ఫోర్లతో 62 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మరో ఎండ్ లో ధోనీ 2 పరుగులతో అజేయంగా ఉన్నాడు.

బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు తీయగా, చహల్ కు ఓ వికెట్ లభించింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేయడానికి ముందు హర్షల్ పటేల్ గణాంకాలు 3-0-14-3 కాగా, జడేజా విశ్వరూపంతో ఆ గణాంకాలు కాస్తా 4-0-51-3గా మారిపోయాయి.


More Telugu News