వేర్వేరు బ్లడ్ గ్రూప్ వ్యక్తుల మధ్య కిడ్నీ మార్పిడి... హైదరాబాదు కిమ్స్ డాక్టర్ల ఘనత

  • కిడ్నీల వైఫల్యంతో బాధపడుతున్న అషీమ్ దాస్
  • కిడ్నీ ఇచ్చేందుకు ముందుకొచ్చిన భార్య
  • అషీమ్ దాస్ బ్లడ్ గ్రూప్ బీ పాజిటివ్
  • భార్య బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్
  • ప్లాస్మాఫెరెసిస్ నిర్వహించిన కిమ్స్ డాక్టర్లు
  • విజయవంతంగా కిడ్నీ మార్పిడి
సాధారణంగా ఓ వ్యక్తికి కిడ్నీ మార్పిడి చేయాలంటే, ఆ కిడ్నీ దాత బ్లడ్ గ్రూప్, రోగి బ్లడ్ గ్రూప్ ఒకటే అయ్యుండాలి. కానీ హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రి వైద్యులు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. వేర్వేరు బ్లడ్ గ్రూప్ లకు చెందిన వ్యక్తుల మధ్య కిడ్నీ మార్పిడి విజయవంతంగా చేసి, అవయవదానంలో సరికొత్త అధ్యాయానికి బాటలు వేశారు. అసోంకు చెందిన అషీమ్ దాస్ రెండు కిడ్నీల వైఫల్యంతో రెండేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటున్నారు. అయితే డయాలసిస్ లోనూ సమస్యలు వస్తుండడంతో వైద్యులు కిడ్నీ మార్పిడి ఒక్కటే పరిష్కారమని తేల్చారు.

ఈ నేపథ్యంలో అషీమ్ దాస్ భార్య కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అయితే ఇక్కడే ఓ చిక్కొచ్చి పడింది. ఆమె బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ కాగా, భర్త అషీమ్ దాస్ ది బీ పాజిటివ్ బ్లడ్ గ్రూప్. సాధారణంగా, మరో బ్లడ్ గ్రూప్ వ్యక్తి అవయవాలను రోగి శరీరంలోని యాంటీబాడీలు తీవ్రంగా వ్యతిరేకిస్తాయి. అందుకే, కిమ్స్ వైద్యులు తొలుత అషీమ్ దాస్ శరీరంలోని యాంటీబాడీలను ఓ క్రమపద్ధతిలో తగ్గించుకుంటూ వచ్చారు. దీన్ని వైద్య పరిభాషలో ప్లాస్మాఫెరిసిస్ గా పేర్కొంటారు. ఈ ప్రక్రియ సత్ఫలితాలు ఇచ్చేందుకు రెండు వారాల సమయం పట్టింది. అనంతరం అషీమ్ దాస్ కు విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు.

ఈ సర్జరీ నెలరోజుల కిందట జరగ్గా, ప్రస్తుతం అషీమ్ దాస్ ఆరోగ్యంగా ఉన్నారని, సాధారణ వ్యక్తిలా తన దైనందిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. దీనిపై కిమ్స్ వైద్య నిపుణులు మాట్లాడుతూ, అవయవదానంలో ఇదొక సరికొత్త మార్గానికి బీజం వేస్తుందని పేర్కొన్నారు. డయాలసిస్ దశ కూడా దాటిపోయిన కిడ్నీ రోగులకు కిడ్నీ మార్పిడి ఒక్కటే చివరి అవకాశం అని, వారి బంధువులు కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చినా ఇరువురి బ్లడ్ గ్రూప్ ఒక్కటి కాని సందర్భాలు ఎన్నో ఉన్నాయని వెల్లడించారు. ఈ పరిస్థితి చాలామంది పాలిట ప్రాణాంతకంగా మారుతుందని, ఇప్పుడు తాము నిర్వహించిన వేర్వేరు బ్లడ్ గ్రూప్ వ్యక్తుల మధ్య కిడ్నీ మార్పిడితో ఆ సమస్య తీరుతుందని అన్నారు.

అషీమ్ దాస్ కు నిర్వహించిన ప్లాస్మాఫెరెసిస్ లో డాక్టర్ ఇ.రవి, డాక్టర్ హిమదీప్తి పాలుపంచుకోగా, డాక్టర్ శర్బేశ్వర్ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు.


More Telugu News