ఐపీఎల్ లో చెన్నై వర్సెస్ బెంగళూరు... టాస్ గెలిచిన ధోనీ

  • ఐపీఎల్ లో నేడు ఆధిపత్య పోరు
  • పాయింట్ల పట్టికలో వరుసగా ఒకటి, రెండు స్థానాల్లో బెంగళూరు, చెన్నై
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్
  • ఇప్పటివరకు ఓటమి ఎరుగని బెంగళూరు
ఐపీఎల్ 14వ సీజన్ లో ఎదురులేని రీతిలో జైత్రయాత్ర సాగిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నేడు చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ కు ముంబయిలోని వాంఖెడే స్టేడియం వేదికగా నిలుస్తోంది. టోర్నీలో ఆధిపత్యం కోసం జరుగుతున్న ఈ పోరులో చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోనీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

గత సీజన్లకు భిన్నంగా ఈసారి బెంగళూరు జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉండడం, కీలక ఆటగాళ్లు సమయోచితంగా రాణిస్తుండడంతో ఆర్సీబీ విజయాల బాటలో పయనిస్తోంది. ఇప్పటిదాకా ఆ జట్టు ఆడిన 4 మ్యాచ్ ల్లోనూ నెగ్గింది. మరోవైపు, ధోనీ నాయకత్వంలోని సీఎస్కే 4 మ్యాచ్ లు ఆడి మూడింట విజయాలు నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో బెంగళూరు నెంబర్ వన్ స్థానంలో ఉండగా, చెన్నై రెండో స్థానంలో కొనసాగుతోంది.

ఇక, నేటి మ్యాచ్ కోసం చెన్నై జట్టులో బ్రావో, తాహిర్ లకు స్థానం కల్పించారు. మొయిన్ అలీ ఫిట్ గా లేడని, ఎంగిడీని తప్పించామని ధోనీ వెల్లడించాడు. అటు, బెంగళూరు జట్టులోనూ రెండు మార్పులు జరిగాయి. రిచర్డ్సన్ స్థానంలో డాన్ క్రిస్టియన్... షాబాజ్ అహ్మద్ స్థానంలో నవదీప్ సైనీ తుదిజట్టులోకి వచ్చారు.


More Telugu News