మహిళల్లోనే కరోనా ప్రతిరక్షకాలు ఎక్కువ: ముంబై సీరో సర్వేలో వెల్లడి

  • 37.12% మందికి యాంటీబాడీలు
  • అదే పురుషుల్లో అయితే కేవలం 35%
  • మురికివాడల్లో 41% మందికి ప్రతిరక్షకాలు
  • క్లాస్ ఏరియాల్లోని ప్రజల్లో 28.5% మందికి
పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఎక్కువగా కరోనా ప్రతిరక్షకాలున్నాయట. మురికివాడల్లోని ప్రజల్లో దాదాపు సగం మందికి మహమ్మారి సోకిందట. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని పరిస్థితి ఇది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన సీరో సర్వే ఫలితాలను తాజాగా వెల్లడించింది. మురికివాడల్లో సీరో పాజిటివిటీ రేటు తగ్గుతుంటే.. క్లాస్ ప్రాంతాల్లో మాత్రం పెరుగుతోందని తెలిపింది. ప్రస్తుతం క్లాస్ ప్రాంతాలకు చెందిన ప్రజలే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారని పేర్కొంది.

సీరో సర్వేలో 37.12 శాతం మంది మహిళలకు యాంటీ బాడీలున్నట్టు తేలగా.. పురుషుల విషయంలో అది 35.02 శాతంగా ఉందని వెల్లడించింది. మురికివాడల్లోని 41.61 శాతం మందిలో కరోనా యాంటీ బాడీలున్నాయని పేర్కొంది. మొత్తంగా ముంబైలోని 24 వార్డులకు సంబంధించి 10,197 నమూనాలను పరీక్షించగా 36.3 శాతం మందిలో ప్రతిరక్షకాలున్నాయని ప్రకటించింది. కాగా, ప్రైవేట్ ల్యాబ్ ల నుంచి క్లాస్ ప్రాంతాలకు చెందినవారి శాంపిళ్లను టెస్ట్ చేయగా 28.5 శాతం మందిలో యాంటీ బాడీలున్నట్టు తేలిందని తెలిపింది.

మార్చిలో నమూనాలు సేకరించామని, వాటిని బీఎంసీ మాలిక్యులార్ బయాలజీ లేబొరేటరీ, కస్తూర్బా ఆసుపత్రి పరిసరాల్లో పరీక్షించామని ఓ అధికారి చెప్పారు. గత ఏడాది జూలైలో చేసిన సర్వేలో మూడు వార్డుల్లోని మురికివాడల్లో 57 శాతం మందికి ప్రతిరక్షకాలున్నట్టు తేలిందని, ఆగస్టులో 45 శాతంగా నిర్ధారణ అయిందని చెప్పారు.


More Telugu News