ఫిబ్రవరి తరువాత ఇక క్రికెట్ కు రిటైర్ మెంట్: మిథాలీ రాజ్

  • ప్రస్తుతం 38 ఏళ్ల వయసులో ఉన్న మిథాలీ
  • న్యూజిలాండ్ లో జరగనున్న వరల్డ్ కప్
  • ఆపై ఆటకు స్వస్తి చెప్పే ఆలోచనలో మిథాలీ
ఎన్నో ఏళ్లుగా భారత మహిళా క్రికెట్ జట్టులో ఆడుతూ, కెప్టెన్ గా కూడా విధులు నిర్వహిస్తున్నా, కలగా మిగిలిన వరల్డ్ కప్ టైటిల్ కోసం మరొక్కసారి ప్రయత్నించి, ఆపై ఆటకు రిటైర్ మెంట్ చెబుతానని స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్ వ్యాఖ్యానించింది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో న్యూజిలాండ్ లో ప్రపంచ కప్ క్రికెట్ పోటీ జరగనుండగా, ఆపై ఆటకు వీడ్కోలు పలికే చాన్స్ ఉందని ఆమె తెలిపింది. దాదాపు 21 సంవత్సరాల కెరీర్ ను తాను పూర్తి చేసుకున్నానని, 2022 తన కెరీర్ కు చివరి సంవత్సరం కావచ్చని వెల్లడించింది. ప్రస్తుతానికి తన ఫిట్ నెస్ పైనే దృష్టిని సారించానని చెప్పింది.

"1971: ది బిగినింగ్ ఆఫ్ ఇండియాస్ క్రికెట్ గ్రేట్ నెస్" అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన సభలో ఆమె వర్చ్యువల్ గా పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వన్డే వరల్డ్ కప్ కు ముందు ఇంగ్లండ్, ఆసీస్, న్యూజిలాండ్ తో ద్వైపాక్షిక సిరీస్ లను ఆడాల్సి వుందని, ఇప్పటి నుంచి ప్రతి సిరీస్ తమకు ముఖ్యమేనని పేర్కొంది. ఈ పోటీల కోసం భారత జట్టు పటిష్ఠంగా ఉండేలా చూసే పనిలో ఉన్నామని, ఫాస్ట్ బౌలింగ్ విషయంలో కొన్ని బలహీనతలు ఉన్న మాట వాస్తవమేనని, ఈ విషయంలో దృష్టిని సారించామని తెలిపింది.

జులన్ గోస్వామి రిటైర్ అయితే, ఆమె స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమని తెలిపింది. కాగా, ప్రస్తుతం 38 సంవత్సరాల వయసులో ఉన్న మిథాలీ రాజ్, ఇంతవరకూ 10 టెస్టులు, 214 వన్డేలు 89 టీ-20 మ్యాచ్లు ఆడింది. ఇక, ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సునీల్ గవాస్కర్, మిథాలీ బృందం విరాట్ కోహ్లీ టీమ్ ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.



More Telugu News