కరోనా చికిత్స ధరల పట్టీని ప్రైవేటు ఆసుపత్రులు తప్పనిసరిగా ప్రదర్శించాలి: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

  • ఏపీలో కొవిడ్ చికిత్సపై విష్ణు స్పందన
  • ఒక్కో ఆసుపత్రిలో ఒక్కో రేటు వసూలు చేస్తున్నారని ఆరోపణ
  • ఆసుపత్రుల మధ్య ధరల వ్యత్యాసం ఉందన్న విష్ణు  
  • ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఏపీలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. సీఎం జగన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఏపీలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్సకు సంబంధించిన ధరలు ఒక్కో ఆసుపత్రిలో ఒక్కో విధంగా ఉన్నాయని ఆరోపించారు.

కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో అర్హత, తగిన సౌకర్యాలు, సంబంధిత సిబ్బంది లేకపోయినా ధనార్జనే ధ్యేయంగా చికిత్స ప్రారంభిస్తూ, చివరి నిమిషంలో వైద్యం చేయలేక చేతులెత్తేస్తున్నారని వెల్లడించారు. మరికొన్ని చోట్ల సర్కారు నిర్ణయించిన ధరల కంటే అధిక మొత్తంలో వసూళ్లు చేస్తున్నారని వివరించారు. కొవిడ్ చికిత్సకు సంబంధించి నిర్దిష్టమైన ధరల పట్టీని ప్రైవేటు ఆసుపత్రుల ముందు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రదర్శించాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. నిబంధనలు పాటించని ఆసుపత్రుల యాజమాన్యాలపై తక్షణమే చర్యలు చేపట్టి ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.


More Telugu News