భారత్‌లో మరో టీకా మూడో దశ క్లినికల్‌ ప్రయోగాలకు అనుమతి!

  • బయోలాజికల్‌-ఈ టీకా ప్రయోగాలకు సీడీఎస్‌సీఓ ఓకే
  • ఇప్పటికే తొలి రెండు దశలు పూర్తి చేసుకున్న వ్యాక్సిన్‌
  • సమర్థమైన రోగనిరోధకత ఏర్పడిందని వెల్లడి
  • మూడో దశలో 1,268 మందిపై ప్రయోగం
భారత్‌లో మరో కరోనా టీకా మూడో దశ ప్రయోగాలు ప్రారంభం కానున్నాయి. బయోలాజికల్-ఈ రూపొందించిన టీకా మూడో దశ క్లినికల్‌ ప్రయోగాల నిర్వహణకు ‘సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీఓ)’ నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. ఇప్పటికే భారత్‌లో జరిగిన ఒకటి, రెండో దశ ప్రయోగాలు సత్ఫలితాలనిచ్చినట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

భారత్‌లో మొత్తం 15 ప్రాంతాల్లో మూడో దశ ప్రయోగాలు నిర్వహించనున్నట్లు బయోలాజిల్‌-ఈ వెల్లడించింది. 18 నుంచి 80 ఏళ్ల మధ్య వయసు గల 1,268 మందిపై ప్రయోగించి ఈ టీకా సామర్థ్యాన్ని తేల్చనున్నట్లు తెలిపింది. తొలి రెండు దశల్లో 18-65 ఏళ్ల మధ్య వయసు గల 360 మందిపై ప్రయోగించగా మెరుగైన ఫలితాలు వచ్చాయని తెలిపింది. సమర్థమైన రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందడంతో పాటు ఎలాంటి తీవ్రమైన దుష్ప్రభావాలు తలెత్తలేదని తెలిపింది.


More Telugu News