ఏపీలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ... వీటికి మాత్రమే మినహాయింపు!

  • ఏపీలో కరోనా ఉగ్రరూపం
  • రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ
  • కఠినంగా అమలు చేయాలంటూ కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు
  • తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు కర్ఫ్యూ కొనసాగింపు
ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతున్నందున రాత్రిపూట కర్ఫ్యూ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాత్రి పూట కర్ఫ్యూ ఈ రోజు నుంచే అమల్లోకి రానుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతుందని పేర్కొంది. నైట్ కర్ఫ్యూ సమయంలో కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, హోటళ్లు మూసివేయాలని స్పష్టం చేసింది. అత్యవసర సేవలకు మాత్రమే కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

ఆసుపత్రులు, ల్యాబ్ లు, ఔషధ దుకాణాలు, మీడియా, టెలికాం, ఇంటర్నెట్, కేబుల్ సేవలు, పెట్రోల్ బంకులు, విద్యుత్ సంస్థల కార్యాలయాలు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఆహార పదార్థాల సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపునిస్తున్నట్టు వివరించింది. విమాన, రైలు ప్రయాణాలు, వైద్యులు, సిబ్బంది రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్టు తెలిపింది. అత్యవసర రవాణా వాహనాలు, అంతర్రాష్ట్ర రవాణాకు ఆంక్షలు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇక, రాత్రి పూట కర్ఫ్యూ సందర్భంగా ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించింది. కర్ఫ్యూ పకడ్బందీగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది.


More Telugu News