హైదరాబాద్ ఆసుపత్రిలో కరోనాతో వ్యక్తి మృతి.. వెంటిలేటర్ ను ధ్వంసం చేసిన మనవరాలు!

  • కింగ్ కోఠి ఆసుపత్రిలో నాలుగు రోజుల క్రితం చేరిన వృద్ధుడు
  • ఆరోగ్యం విషమించి మృతి
  • పెద్దగా అరుస్తూ గందరగోళం సృష్టించిన మనవరాలు
తన తాత మృతి చెందడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మనవరాలు... ఆసుపత్రిలోని వెంటిలేటర్ ను ధ్వంసం చేసిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. ఈ ఘటన నగరంలోని కింగ్ కోఠి జిల్లా ఆసుపత్రిలో జరిగింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్ తెలిపిన వివరాల ప్రకారం... కరోనా సోకడంతో బోడుప్పల్ కు చెందిన 88 ఏళ్ల ఓ వృద్ధుడిని ఈ నెల 20న ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్టా ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయితే ఆయన ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రిలో చనిపోయారు.

దీంతో, ఆయన వెంట ఉన్న యువతి (మనుమరాలు) కోపంతో పెద్దపెద్దగా అరుస్తూ గందరగోళం సృష్టించింది. ఆగ్రహంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. వెంటిలేటర్ ను బలంగా తోసేయడంతో అది పగిలిపోయింది. దీనిపై ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, నారాయణగూడ పోలీసులు వచ్చి ఆమెను అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం ఆమెపై ఆసుపత్రి వైద్యులు నారాయణగూడ పీఎస్ లో ఫిర్యాదు చేశారు.


More Telugu News