రోగుల‌కు ఆక్సిజ‌న్ అందించ‌లేక‌పోవ‌డం నేర‌పూరిత చ‌ర్య‌: ఢిల్లీ హైకోర్టు

  • ఆక్సిజ‌న్ కొర‌త‌పై  ప‌లు ఆసుప‌త్రులు ఢిల్లీ హైకోర్టులో పిటిష‌న్లు
  • స‌ర్కారు మ‌రిన్ని క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోర్టు సూచన‌
  • ఢిల్లీలో ఆక్సిజ‌న్ ప్లాంట్ ఎందుకు ఏర్పాటు చేయ‌లేద‌ని ప్ర‌శ్న‌
  • ఏర్పాటు చేయాల‌ని ఢిల్లీ ప్ర‌భుత్వానికి ఆదేశం
ఆసుపత్రుల్లో రోగుల‌కు ఆక్సిజ‌న్ అంద‌క‌పోతుండడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆక్సిజ‌న్ కొర‌త‌పై  ప‌లు ఆసుప‌త్రులు ఢిల్లీ హైకోర్టులో పిటిష‌న్లు దాఖ‌లు చేయ‌డంతో వాటిపై విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం.. ఆక్సిజ‌న్ కొర‌త తీర్చేందుకు కేంద్ర స‌ర్కారు విఫ‌ల‌మ‌వుతోన్న తీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేసింది.

ఈ విష‌యంలో కేంద్ర స‌ర్కారు మ‌రిన్ని క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోర్టు సూచించింది. ఢిల్లీలో ఇప్ప‌టివ‌ర‌కు ఆక్సిజ‌న్ ప్లాంట్ ఎందుకు ఏర్పాటు చేయ‌లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. అలాగే, సొంతంగా ఆక్సిజ‌న్ ప్లాంట్ ఏర్పాటు చేయాల‌ని ఢిల్లీ ప్ర‌భుత్వాన్ని న్యాయ‌స్థానం ఆదేశించింది.

రోగుల‌కు ఆక్సిజ‌న్‌ను అందించ‌క‌పోవ‌డం అనేది నేర‌పూరిత చ‌ర్య అని పేర్కొంది. జీవించ‌డం ప్ర‌జ‌ల ప్రాథ‌మిక హ‌క్కు అని గుర్తు చేసింది. అలాగే, ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాకు ఎవ‌రైనా ఆటంకాలు క‌లిగిస్తే క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చరించింది.  


More Telugu News