మే రెండో వారానికి ఇండియాలో 35 లక్షల యాక్టివ్ కేసులు: శాస్త్రవేత్తల హెచ్చరిక

  • మే 11 నుంచి 15 మధ్య 33 నుంచి 35 లక్షల కేసులు
  • ఎంత వేగంగా పెరుగుతాయో అంతే వేగంగా తగ్గుతాయి
  • కాన్పూర్, హైదరాబాద్ ఐఐటీ శాస్త్రవేత్తల అధ్యయనం
ఇండియాలో కొనసాగుతున్న కరోనా రెండో వేవ్ లో భాగంగా, మే 11 నుంచి 15 మధ్య కాలానికి 33 నుంచి 35 లక్షల వరకూ యాక్టివ్ కేసులు ఉండే అవకాశాలు ఉన్నాయని ఐఐటీ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఆపై మే నెలాఖరు నాటికి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుందని వారు అంచనా వేశారు. శుక్రవారం నాడు ఇండియా మొత్తం మీద దాదాపు మూడున్నర లక్షల కొత్త కేసులు వచ్చిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉండగా, మే రెండో వారానికి వీటి సంఖ్య మరో 10 లక్షలు పెరుగుతుందని కాన్పూర్, హైదరాబాద్ ఐఐటీలు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, తెలంగాణ తదితర ప్రాంతాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. కొత్త కేసుల విషయంలో మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాలు ఈ నెల 30లోగా పీక్ దశకు చేరుకుంటాయని, ఆపై తగ్గుతూ వస్తాయని వారు అంచనా వేశారు.

యాక్టివ్ కేసుల సంఖ్య ఎంత వేగంగా పెరుగుతూ వస్తోందో, అంతే వేగంగా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని, మే నెల చివరికి నాటకీయ పరిణామాల మధ్య కేసుల సంఖ్య దిగి వస్తుందని అధ్యయనానికి నాయకత్వం వహించిన కాన్పూర్ ఐఐటీలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ అంచనా వేశారు.

కాగా, ఈ అధ్యయనంలో వెల్లడైన అంశాలు ఇంకా ప్రచురితం కాలేదు. గత గణాంకాలను పోలుస్తూ 'సూత్ర' మోడల్ లో ఈ అధ్యయనం చేసినట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గతంలో నిర్వహించిన అధ్యయనాల్లో లక్షణాలు లేని రోగుల సంఖ్యను గణించలేదని తెలిపారు. ఇటీవల ఓ అధ్యయనాన్ని నిర్వహించిన శాస్త్రవేత్తలు ఏప్రిల్ 15 నాటికే కేసుల సంఖ్య గరిష్ఠానికి చేరుతుందని అంచనా వేయగా, వాస్తవ పరిస్థితుల్లో అది జరగలేదన్న సంగతి విదితమే.


More Telugu News