మా దేశ వాసులకే తొలి ప్రాధాన్యం: ఇండియాకు వ్యాక్సిన్ ముడి పదార్థాల ఎగుమతి నిషేధాన్ని సమర్థించుకున్న అమెరికా

  • వ్యాక్సిన్ ముడి పదార్థాల ఎగుమతి బ్యాన్
  • సమర్ధించిన బైడెన్ ప్రభుత్వం
  • అమెరికన్లందరికీ టీకా తరువాతే ఇతర దేశాలకు
కొవిడ్-19 వ్యాక్సిన్ ను తయారు చేసేందుకు ఉపకరించే ముఖ్యమైన ముడి పదార్థాన్ని విదేశాలకు ఎగుమతి చేయరాదని ఇటీవల తాము తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా ప్రభుత్వం సమర్థించుకుంది. తమ తొలి ప్రాధాన్యం అమెరికా ప్రజలు మాత్రమేనని, ఈ విషయంలో మరో సందేహమే లేదని అధ్యక్ష వర్గాలు స్పష్టం చేశాయి.

కాగా, అమెరికా తీసుకున్న నిర్ణయంతో, వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడి పదార్థాల ఎగుమతి ఇండియాకు నిలిచిపోగా, వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుందన్న ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో తమకు వ్యాక్సిన్ రా మెటీరియల్ ను సరఫరా చేయాలని భారత్ కోరింది కూడా.

ఈ విషయమై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెట్ ప్రైస్ స్పందిస్తూ, "అమెరికాకు అమెరికన్లే తొలి ప్రాధాన్యం. ఇంతవరకూ కరోనా వ్యాక్సిన్ విషయంలో విజయవంతం అయ్యాము. ఇండియా వినతిని పరిశీలించాం. దీన్ని కాదనడానికి రెండు కారణాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి దేశంలోని ప్రజలపై ప్రత్యేక బాధ్యతను మేము తీసుకున్నాం. రెండోది అమెరికా ప్రజలు. కరోనా కారణంగా మా దేశం ఎంతో నష్టపోయింది. దాదాపు ఐదున్నర లక్షల మంది మరణించారు. ఇప్పటికీ లక్షలాది కేసులు ఉన్నాయి" అని ఆయన అన్నారు.

అమెరికన్లకు పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ ఇచ్చిన తరువాత మిగతా ప్రపంచ అవసరాలను తీర్చేందుకు ముందుంటామని నెడ్ ప్రైస్ వ్యాఖ్యానించారు. వైరస్ మ్యూటేషన్ చెందుతూ, సరిహద్దులను దాటుతోందని, తొలుత అమెరికాలో ఈ మహమ్మారిని పూర్తిగా నియంత్రణలోకి తేవాలన్నదే తమ అభిమతమని ఆయన స్పష్టం చేశారు.


More Telugu News