ముంబై ఇండియన్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం

  • కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్
  • పంజాబ్ బౌలర్ల ముందు చేతులెత్తేసిన ముంబై టాపార్డర్
  • మూడుకు పెరిగిన రోహిత్ సేన పరాజయాలు
ముంబై ఇండియన్స్‌తో గత రాత్రి జరిగిన ఐపీఎల్ 17వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 131 పరుగులు మాత్రమే చేసి బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన పంజాబ్ ఎదుట స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ మయాంక్ అగర్వాల్ (25) వికెట్‌ను కోల్పోయి 14 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. కేఎల్ రాహుల్ 60 (52 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), క్రిస్ గేల్ 43 (35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులతో నాటౌట్‌‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు. 5 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్‌కు ఇది రెండో విజయం కాగా, ముంబైకి  ఇది మూడో పరాజయం.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేసింది. క్వింటన్ డికాక్ (3), ఇషాన్ కిషన్ (6), పొలార్డ్ (16), హార్దిక్ పాండ్యా (1), కృనాల్ పాండ్యా (3) మరోమారు దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ (63), సూర్యకుమార్ యాదవ్ (33) క్రీజులో కుదురుకోవడంతో ముంబై ఆ మాత్రం పరుగులైనా చేయగలిగింది.

పంజాబ్ బౌలర్లలో షమీ, రవి బిష్ణోయ్ చెరో రెండేసి వికెట్లు తీసుకోగా, దీపక్ హుడా, అర్ష్‌దీప్ సింగ్ చెరో వికెట్ తీసుకున్నారు. 60 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. నేడు రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య ముంబైలో మ్యాచ్ జరగనుంది.


More Telugu News