కేంద్రం ఆదేశాలకనుగుణంగా ఈసీ పనిచేస్తోంది: మమతా బెనర్జీ ఆరోపణ

  • మోదీ ప్రచారం కోసమే ర్యాలీలపై ఆంక్షలు విధించలేదు
  • ప్రధాని సభ రద్దు చేసుకోగానే ప్రచారంపై ఆంక్షలు
  • ఈసీ కావాలనే చేసిందని దీదీ ఆరోపణ
  •  కొవిడ్‌ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకే విమర్శలన్న బీజేపీ 
ఎన్నికల సంఘం (ఈసీ)పై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈసీ పనిచేస్తోందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రచార సౌలభ్యం కోసమే ఈసీ ఇన్నాళ్లూ ప్రచార కార్యక్రమాలపై ఆంక్షలు విధించడంపై మౌనం వహించిందని విమర్శించారు. మోదీ తన సభను రద్దు చేసుకున్న వెంటనే ప్రచార కార్యక్రమాలపై ఈసీ ఆంక్షలు విధించడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ నేతల్ని ప్రసన్నం చేసుకోవడంలోనే ఈసీ తలమునకలైందని ఆరోపించారు.

అలాగే దాదాపు మూడు లక్షల మంది బీజేపీ కార్యకర్తలు, పారామిలిటరీ బలగాలు ఎలాంటి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు లేకుండానే బెంగాల్‌లోకి ప్రవేశించారని దీదీ తెలిపారు. వారే కరోనా వ్యాప్తికి కారణం కాదని ఎలా చెప్పగలమని ప్రశ్నించారు. మరోవైపు కొవిడ్‌ సాయంలో రాష్ట్రాల మధ్య కేంద్రం వివక్ష చూపుతోందని ఆమె ఆరోపించారు. గుజరాత్‌కు వ్యాక్సిన్లు ఉచితంగా అందజేస్తున్నారన్నారు.

బెంగాల్‌ నుంచి కేంద్రం ఆక్సిజన్‌ను ఇతర రాష్ట్రాలకు తరలిస్తోందని మమత ఆరోపించారు. భవిష్యత్తుల్లో రాష్ట్రానికి ఆక్సిజన్‌ అవసరమైతే ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. ఆక్సిజన్‌ నిల్వలతో సంసిద్ధంగా ఉండాలని 2020లోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించిందని గుర్తుచేశారు. కానీ, కేంద్రం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పుడు ఈ దుస్థితి రావడానికి ప్రధాని మోదీయే కారణమని ఆరోపించారు.

మరోవైపు మమతా బెనర్జీపై బీజేపీ విరుచుకుపడింది. కొవిడ్‌ నేపథ్యంలో ప్రధాని మోదీ నిర్వహించిన ఏ సమీక్షలోనూ దీదీ పాల్గొనలేదని ఆరోపించింది. బెంగాల్‌లో కరోనా విజృంభణకు దీదీ నిర్లక్ష్యమే కారణమని విమర్శించింది. తప్పును కప్పిపుచ్చుకోవడం కోసమే కేంద్రంపై ఆరోపణలు చేస్తోందని ఆరోపించింది.


More Telugu News