మోదీ, కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించిన రేవంత్ రెడ్డి

  • కల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్
  • స్పందించిన రేవంత్ రెడ్డి
  • నిపుణుల మాట పెడచెవినపెట్టారంటూ మోదీ, కేసీఆర్ లపై విమర్శలు
  • సుప్రీం చీవాట్లకు మోదీ ఎర్రకోట పైనుంచి దూకాలని వ్యంగ్యం
  • హైకోర్టు తిట్లకు కేసీఆర్ హుస్సేన్ సాగర్ లో దూకాలని వ్యాఖ్యలు
దేశంలో కరోనా మహమ్మారి వికటాట్టహాసం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ లపై ధ్వజమెత్తారు. కరోనా నివారణ అంశంలో సుప్రీంకోర్టు చీవాట్లకు ప్రధాని మోదీ ఎర్రకోట పైనుంచి దూకాలని, హైకోర్టు వేసిన మొట్టికాయలకు కేసీఆర్ హుస్సేన్ సాగర్ లో దూకాలని అన్నారు.

కరోనా వ్యాప్తిపై నిపుణుల అభిప్రాయాల పట్ల ఎంతో నిర్లక్ష్యం ప్రదర్శించి, ప్రస్తుత పరిస్థితికి కారకులయ్యారని మోదీ, కేసీఆర్ లపై ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడమే లక్ష్యంగా మోదీ, విపక్షాల ఎమ్మెల్యేలను కొనడంపై కేసీఆర్ దృష్టి పెట్టారని రేవంత్ విమర్శించారు.

మోదీ నిర్లక్ష్యం వల్లే దేశంలో కరోనా వ్యాక్సిన్, ఆక్సిజన్ కు విపరీతమైన కొరత ఏర్పడిందని ఆరోపించారు. కరోనా వ్యాక్సిన్ భారత్ లోనే తయారవుతున్నా, అందరికీ అందుబాటులో లేని పరిస్థితి ఉత్పన్నమైందని అన్నారు. పొరుగు దేశం పాకిస్థాన్ లో కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తుంటే, భారత్ లో ఉచితంగా ఎందుకివ్వరని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పైనా విమర్శలు చేశారు. ఈటల తన పదవికి రాజీనామా చేయడం సబబుగా ఉంటుందని, సొంత శాఖలోని అధికారులే ఆయను లెక్కచేయడంలేదని అన్నారు. 


More Telugu News