అయోధ్య మధ్యవర్తిత్వానికి షారుఖ్‌ ఖాన్‌ను కావాలనుకున్నారట!

  • సీజేఐ బోబ్డే ఆకాంక్ష
  • ఆసక్తికర విషయం వెల్లడించిన వికాస్‌ సింగ్‌
  • బోబ్డే వీడ్కోలులో వెలుగులోకి ఆసక్తికర విషయం
  • అంగీకరించిన షారుఖ్‌
  • చివరకు ఆచరణ సాధ్యం కాని వైనం
నేడు పదవీ విరమణ పొందిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎస్‌.ఏ.బోబ్డే వీడ్కోలు సందర్భంగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అయోధ్య-బాబ్రీ మసీదు వివాదంలో ప్రముఖ బాలీవుడ్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ను మధ్యవర్తిగా బోబ్డే కోరుకున్నారని సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వికాస్‌ సింగ్‌ వెల్లడించారు.

"షారుఖ్ మధ్యవర్తిత్వం నెరపడానికి ఇష్టపడతారేమో చూడండి అని బోబ్డే నన్ను అడిగారు. నేను షారుఖ్ తో మాట్లాడాను. ఆయన కూడా ఈ ప్రతిపాదనను ఆనందంగా అంగీకరించారు. కానీ, చివరకు అది ఆచరణసాధ్యం కాలేదు' అని చెప్పారు వికాస్ సింగ్ చెప్పారు.

అయోధ్య రామజన్మభూమి భూవివాద పరిష్కారానికి సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో కూడిన మధ్యవర్తిత్వ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. దీంట్లో మాజీ న్యాయమూర్తి ఎఫ్‌ఎంఐ ఖలీఫుల్లా, ఆద్యాత్మిక గురు శ్రీ శ్రీ రవిశంకర్‌, సీనియర్‌ న్యాయవాది శ్రీరాం పంచు ఉన్నారు. ఇరు వర్గాలను సంప్రదించి ఓ పరిష్కార మార్గాన్ని సూచించాలని కమిటీని కోర్టు ఆదేశించింది. కానీ, మధ్యవర్తిత్వ కమిటీ ఎలాంటి ఫలితం తేల్చకుండానే నివేదిక సమర్పించింది.

దీంతో సుప్రీంకోర్టు స్వయంగా వాదనలు విని తీర్పు వెలువరించింది. అయోధ్యలోని భూమిని రామాలయ నిర్మాణానికి కేటాయిస్తూ తీర్పు వెలువరించింది. ముస్లింలు మసీదు నిర్మించుకునేందుకు అయోధ్యలోనే మరో స్థలంలో ఐదెకరాల భూమి కేటాయించాలని కేంద్రాన్ని ఆదేశించింది.


More Telugu News