ధూళిపాళ్ల నరేంద్ర భార్యను ఫోన్ ద్వారా పరామర్శించిన నారా లోకేశ్

  • ఈ ఉదయం నరేంద్రను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు
  • పోలీసులు భయానక వాతావరణాన్ని సృష్టించారన్న నరేంద్ర భార్య
  • జగన్ కు, పోలీసు అధికారులకు కోర్టులో చీవాట్లు తప్పవన్న లోకేశ్
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఈ ఉదయం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సంగం డెయిరీ ఛైర్మన్ గా నరేంద్ర ఉన్నారు. ఆ సంస్థలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో పొన్నూరు మండలం చింతలపూడిలో ఆయనను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని, తమ కార్యాలయానికి తరలించారు. ఈ నేపథ్యంలో నరేంద్ర భార్య జ్యోతిర్మయిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫోన్ ద్వారా పరామర్శించారు.

కరోనా విస్తరిస్తున్న ఈ సమయంలో 400 మంది పోలీసులు ఇంట్లోకి ప్రవేశించి భయానక వాతావరణాన్ని సృష్టించారని ఈ సందర్భంగా లోకేశ్ కు జ్యోతిర్మయి తెలిపారు. విచారణకు తాము సిద్ధమని, అన్ని విధాలా సహకరిస్తామని చెప్పినా వినకుండా భయోత్పాతం సృష్టించారని చెప్పారు.

ఈ సందర్భంగా జ్యోతిర్మయిని లోకేశ్ ఓదార్చారు. ధూళిపాళ్ల కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. నరేంద్రపై పెట్టిన అక్రమ కేసుల్లో ముఖ్యమంత్రి జగన్ కు, వైసీపీ యూనిఫామ్ వేసుకున్న పోలీసు అధికారులకు కోర్టులో చీవాట్లు తప్పవని అన్నారు.


More Telugu News