ఆక్సిజన్ అందక ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో 25 మంది కన్నుమూత!

  • ఆక్సిజన్ కొరతపై కేంద్రాన్ని నిందించిన ఆప్ ప్రభుత్వం
  • మరణించిన వారంతా తీవ్రమైన రోగ లక్షణాలున్నవారే
  • ఆక్సిజన్ ట్యాంకర్ ను పంపించామని తెలిపిన కేంద్రం
కరోనా సోకి, చికిత్స నిమిత్తం న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరిన వారిలో   ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో కనీసం 25 మంది మరణించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఉదయం ఆసుపత్రి వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, గడచిన 24 గంటల వ్యవధిలో ప్రాణవాయువు నిల్వలు లేక 25 మంది చనిపోయారని, వీరంతా తీవ్రమైన రోగ లక్షణాలతో ఉన్నవారేనని అన్నారు.

న్యూఢిల్లీలోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత అధికంగా ఉందని, కేంద్రం స్పందించడం లేదని ఆప్ నేతలు ఆరోపిస్తున్న వేళ, ఈ వార్త బయటకు రావడం గమనార్హం. వీరందరి మృతికీ తక్కువ పీడనంతో ఉన్న ఆక్సిజన్ కారణం అయి ఉండవచ్చని ఆసుపత్రి వర్గాలు వ్యాఖ్యానించాయి.

ఆసుపత్రిలో ఉన్న ఆక్సిజన్ రెండు గంటల పాటు కూడా అందరికీ రాదని, వెంటిలేటర్లు, బీపీఏపీ పరికరాలు కూడా సక్రమంగా పనిచేయడం లేదని, ఈ పరిస్థితుల్లో తాము మాత్రం ఏం చేయగలమని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. మరో 60 మంది రోగుల వరకూ ప్రాణాల కోసం పోరాడుతున్నారని, ఆక్సిజన్ ట్యాంకర్ల కోసం వేచి చూస్తున్నామని, ఇదే విషయాన్ని కేంద్రానికి స్పష్టం చేశామని ఢిల్లీ ఆరోగ్య మంత్రి తెలిపారు.

ప్రస్తుతం ఐసీయూల్లో మాన్యువల్ వెంటిలేషన్ ను అందిస్తున్నామని, 500 మంది వరకూ కరోనా రోగులుండగా, 150 మందికి ఆక్సిజన్ అవసరం ఉందని ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఇదిలావుండగా, సర్ గంగారామ్ ఆసుపత్రికి ఆక్సిజన్ ట్యాంకర్ ను పంపించామని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఉదయం 10 గంటల సమయంలో ప్రాణ వాయువు సరఫరాను పునరుద్ధరించామని అన్నారు. అంబేద్కర్ ఆసుపత్రి వద్ద రెండు టన్నుల ఆక్సిజన్ తో ఉన్న ఓ ట్యాంకర్ నిలిచిపోయిందని, దాన్ని కూడా పంపుతున్నామని తెలిపారు.


More Telugu News