పాకిస్థాన్‌ వెళ్లి వచ్చిన 100 మంది సిక్కులకు కరోనా

  • వైశాఖీ పర్వదినం నేపథ్యంలో పాక్‌కు వెళ్లిన సిక్కులు
  • వెళ్లేటప్పుడు అందరికీ నిర్ధారణ పరీక్షలు
  • ఏప్రిల్‌ 12న ప్రారంభమైన యాత్ర
  • మొత్తం 800 మందికి వీసా జారీ చేసిన పాక్‌
  • ఇప్పటి వరకు 300 మందికి పరీక్షలు
వైశాఖీ పర్వదినం నేపథ్యంలో పాకిస్థాన్‌లోని గురుద్వారాను దర్శించుకొని తిరిగొస్తున్న దాదాపు 100 మంది సిక్కులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఇది పంజాబ్‌ యంత్రాంగాన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టింది. తిరిగొస్తున్న భక్తులకు అటారీ-వాఘా సరిహద్దులో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 300 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా.. 98 మంది వైరస్‌ బారినపడ్డట్లు తేలింది.

కరోనా బారినపడ్డ వారందరినీ ప్రస్తుతం వైద్యపర్యవేక్షణలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. వారిని కొవిడ్‌ ఆస్పత్రుల్లో చేర్చాలా? వద్దా? అనే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. మొత్తం 800 మంది సిక్కు యాత్రికులు ఏప్రిల్‌ 12న పాకిస్థాన్‌కు వెళ్లారు. వెళ్లేటప్పుడు వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. రెండు రోజులు క్యాంపులో ఉన్న వారంతా కొవిడ్‌-ఫ్రీ క్లియరెన్స్‌ ధ్రువపత్రం కూడా పొందారు. యాత్రికులకు పాకిస్థాన్‌ 10 రోజుల వీసా జారీ చేసింది. ఈ యాత్రలో వీరు దాయాది దేశంలోని పలు సిక్కు క్షేత్రాలను సందర్శించారు.


More Telugu News