క‌రోనా సోకిందంటూ కుటుంబ స‌భ్యులు, గ్రామ‌స్థుల వివ‌క్ష‌.. చెరువులో దూకి వృద్ధుడి ఆత్మ‌హ‌త్య‌

  • కృష్ణా జిల్లా గన్నవరం మండలం మర్లపాలెంలో ఘ‌ట‌న‌
  • జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతోన్న వృద్ధుడు
  • క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష చేయించుకోక‌ముందే వివ‌క్ష‌
జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతోన్న ఓ వృద్ధుడి పట్ల కుటుంబ స‌భ్యులు, గ్రామ‌స్థులు వివ‌క్ష‌ ప్రదర్శించారు. ఆయ‌న‌కు క‌రోనా వ‌చ్చిందేమోన‌ని దూరంగా పెడుతున్నారు. అస‌లే అనారోగ్యంతో బాధ‌ప‌డుతోన్న ఆ వృద్ధుడు గ్రామ‌స్థుల అవ‌మానాన్ని త‌ట్టుకోలేక‌పోయాడు. చెరువులో దూకి ఆత్మ‌హ‌త్య చేకున్నాడు.

ఈ ఘ‌ట‌న కృష్ణా జిల్లా గన్నవరం మండలం మర్లపాలెంలో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు వివ‌రాలు తెలిపారు. మ‌ర్ల‌పాలేనికి చెందిన గాసర్ల హరిబాబు (74) మూడు రోజులుగా అనారోగ్యంతో  బాధపడుతున్నాడు.  ఆయ‌నకు సాయం చేయడం మాట అటుంచి, అంద‌రూ వివ‌క్షతో చూశారు. దీంతో ఆయన మ‌న‌స్తాపానికి గురయ్యాడు.

క‌రోనా సోకిందా?  లేదా? అన్న విష‌యాన్ని నిర్ధారించుకునేందుకు పరీక్ష కూడా చేయించుకోకుండానే భయంతో  చెరువులో దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఆయ‌న‌ మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు.  


More Telugu News