పోరాడి ఓడిన కోల్‌కతా.. చెన్నై ఖాతాలో మరో విజయం

  • కోల్‌కతా జట్టు పుట్టిముంచిన టెయిలెండర్లు
  • కార్తీక్, రస్సెల్స్, కమిన్స్ పోరాటం వృథా
  • పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో చెన్నై
ఐపీఎల్‌లో భాగంగా గత రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ పోరాడి ఓడింది. 221 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 202 పరుగులకే ఆలౌటైంది. ఒకానొక దశలో చెన్నైకు వణుకుతెప్పించింది కూడా. విజయం దిశగా పయనిస్తున్నట్టు కనిపించింది.

అయితే, టెయిలెండర్లు చేతులెత్తేయడంతో దినేశ్ కార్తీక్ (40), రస్సెల్ (54), కమిన్స్ (66) పోరాటం వృథా అయింది. జట్టులో నలుగురు ఆటగాళ్లు.. శుభ్‌మన్ గిల్, కమలేశ్ నాగర్‌కోటి, వరుణ్ చక్రవర్తి డకౌట్లు కాగా, ప్రసిద్ధ్ కృష్ణ పరుగులేమీ చేయకుండా నాటౌట్‌గా నిలిచాడు. నితీశ్ రాణా (9), రాహుల్ త్రిపాఠీ (8), కెప్టెన్ మోర్గాన్ (7), సునీల్ నరైన్ (4) దారుణంగా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ నాలుగు వికెట్లు తీసుకోగా, లుంగి ఎన్గిడి 3, శామ్ కరణ్ ఒక వికెట్ పడగొట్టాడు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై ఈ సీజన్‌లో తొలిసారి 200 పరుగుల మార్క్ దాటింది. రుతురాజ్ గైక్వాడ్ (64), డుప్లెసిస్ (95, నాటౌట్) వీర విజృంభణతో స్కోరు ఉరకలెత్తింది. వీరిద్దరూ బౌలర్లపై చెలరేగిపోయారు. పడిన బంతులను పడినట్టు బౌండరీలు దాటించారు. కోల్‌కతా బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. మొయీన్ అలీ 25, కెప్టెన్ ధోనీ 17 పరుగులు చేసి ఔటయ్యారు. 6 పరుగులు చేసిన రవీంద్ర జడేజా నాటౌట్‌గా నిలిచాడు. దీంతో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది.

కోల్‌కతా బౌలర్లలో చక్రవర్తి, నరైన్, రసెల్ చెరో వికెట్ తీసుకున్నారు. అద్భుత ఆటతీరుతో చెన్నైకి విజయాన్ని అందించిన డూ ప్లెసిస్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడింటిలో విజయం సాధించిన చెన్నై ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.


More Telugu News