కేంద్ర ప్ర‌భుత్వ వ్యాక్సిన్ పాల‌సీ వ‌ల్ల ఆరోగ్యం, ఆస్తులు, చివరకు ప్రాణాలూ కోల్పోతారు: రాహుల్ గాంధీ

  • వ్యాక్సిన్ పాల‌సీని నోట్లరద్దుతో పోల్చిన రాహుల్
  • సామాన్య ప్రజలు క్యూలైన్లలో నిల్చుంటారని ఆందోళ‌న‌
  • బడా పారిశ్రామికవేత్తలకే లాభం చేకూరుతుంద‌ని ఆరోప‌ణ‌
కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన వ్యాక్సిన్‌ పాలసీని దేశంలో నాలుగేళ్ల క్రితం ప్రకటించిన నోట్లరద్దుతో పోల్చుతూ స‌ర్కారుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమ‌ర్శ‌ల జ‌ల్లు కురిపించారు. వ్యాక్సిన్‌ పాలసీ నోట్లరద్దు కంటే తక్కువేం కాదని, సామాన్య ప్రజలు క్యూలైన్లలో నిల్చుంటారని మండిపడ్డారు.

ఈ క్ర‌మంలో ఆరోగ్యం, ఆస్తులు, చివరకు ప్రాణాలూ కోల్పోతారని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ పాల‌సీ వ‌ల్ల‌ చివ‌రికి కొంద‌రు బడా పారిశ్రామికవేత్తలకే లాభం చేకూరుతుంద‌ని చెప్పారు. కాగా, వ్యాక్సిన్ తయారీదారులు త‌మ 50 శాతం వ్యాక్సిన్ల‌ ఉత్పత్తిని రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేయడానికి కేంద్ర ప్ర‌భుత్వం అనుమతి నిచ్చిన విష‌యం తెలిసిందే. 

అలాగే, 18 ఏళ్లు పైబడిన వారందరూ వచ్చేనెల‌ 1 నుంచి వ్యాక్సిన్లు తీసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదిలావుంచితే, గ‌తంలో ప్ర‌క‌టించిన పెద్ద నోట్ల ర‌ద్దు వ‌ల్ల ప్ర‌జ‌లు బ్యాంకుల ముందు భారీగా క్యూలలో నిల‌బ‌డి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు బ్యాంకుల ముందే క్యూలైన్ల‌లో ప్రాణాలు వ‌దిలారు. ఇప్పుడూ వ్యాక్సిన్ పాల‌సీ వ‌ల్ల ఆ ప‌రిస్థితులే వ‌స్తాయ‌ని రాహుల్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.


More Telugu News