15 మంది కరోనా పేషెంట్ల ప్రాణాలను కాపాడిన నాగ్​ పూర్​ పోలీసులు.. తర్వాత కేసులో ఇరుక్కున్న వైనం!

  • ఆక్సిజన్ కావాలని నాగ్ పూర్ ఆసుపత్రి విజ్ఞప్తి
  • సమీపంలోని ఆక్సిజన్ ప్లాంటుకు వెళ్లిన పోలీసులు
  • పర్మిషన్ లెటర్ లేనిదే ఇవ్వనన్న యజమాని
  • విజ్ఞప్తి మేరకు 7 సిలిండర్లు అందజేత 
  • బెదిరించి తీసుకొచ్చారంటూ వారిపై కేసు
ఆ పోలీసులు 15 మంది కరోనా పేషెంట్ల ప్రాణాలను కాపాడారు. కానీ, వారికి తెలియకుండానే ఓ కేసులో ఇరుక్కున్నారు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగిన ఆ ఘటన వివరాలివీ.. ఆదివారం రాత్రి జరిపట్కలోని తిరుపూడి ఆసుపత్రి సిబ్బంది ఆక్సిజన్ అయిపోయిందంటూ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో జరిపట్క పోలీసులను ఆశ్రయించారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ లేదని, అత్యవసరంగా 15 మంది కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ కావాలని మొరపెట్టుకున్నారు.

కనీసం 10 సిలిండర్లయినా కావాలంటూ పోలీసులను కోరారు. దీంతో వెంటనే స్టేషన్ లో ఆ టైంలో డ్యూటీ చేస్తున్న ఎస్సై మహాదేవ్ నాయక్ వాదె.. సిబ్బందితో కలిసి స్థానికంగా ఉన్న ఆక్సిజన్ తయారీ ప్లాంట్ కు వెళ్లారు. కరోనా పేషెంట్ల కోసం ఆక్సిజన్ కావాలంటూ విజ్ఞప్తి చేశారు. అయితే, పర్మిషన్ లెటర్ లేకుండా ఆక్సిజన్ ఇవ్వబోనని ఆ యజమాని తేల్చి చెప్పడంతో.. అక్కడ ఎమర్జెన్సీ గురించి ఎస్సై మహాదేవ్ వివరించారు. దీంతో ఏడు సిలిండర్లను ఆ యజమాని అందించాడు.

ఆ సిలిండర్లను తీసుకుని ఆసుపత్రికి వెళ్లిన సిబ్బంది పరిస్థితి విషమంగా ఉన్న 15 మంది కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ అందించారు. వాళ్ల ప్రాణాలు నిలిచాయి. అయితే, ఆక్సిజన్ సిలిండర్లను తీసుకురావడంపై ఆయన పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరించి సిలిండర్లు తీసుకొచ్చారన్న ఆరోపణలతో మహాదేవ్, ఆయనతో పాటు వెళ్లిన సిబ్బందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News