కరోనా చికిత్సకు టాబ్లెట్​.. తయారీ సాంకేతికతపై పేటెంట్​ కు భారత సంస్థ దరఖాస్తు

  • మోల్నుపిరావిర్ తో సత్ఫలితాలు
  • ఎలుకల్లో మహమ్మారిని తగ్గించిన ఔషధం
  • అమెరికాలోని ఎన్ ఐహెచ్, బ్రిటన్ ప్లైమౌత్ వర్సిటీల అధ్యయనం
  • మనుషులపై నడుస్తున్న క్లినికల్ ట్రయల్స్
  • తుది దశకు చేరుకున్న ప్రయోగాలు
కరోనాకు సరికొత్త మందు రాబోతోంది. ఇప్పటిదాకా వ్యాక్సిన్లే మహమ్మారిపై బ్రహ్మాస్త్రం అని చెబుతూ వస్తున్నారు. కరోనా వచ్చి ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న వారికి రెమ్ డెసివిర్ యాంటీ వైరల్ ఇంజెక్షన్ ను ఇస్తున్నారు. అయితే, నోటి నుంచి తీసుకునే జస్ట్ ఓ టాబ్లెట్టే కరోనాకు విరుగుడు అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎలుకలపై చేసిన ప్రయోగంలో ఆ మందు సత్ఫలితాలను ఇచ్చిందని చెబుతున్నారు.

ఆ మందు పేరు మోల్నుపిరావిర్. దాన్నే ఎంకే 4482 అని శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు. ఈ మందు కొత్తదేం కాదు. ఇప్పటికే ఇన్ ఫ్లుయెంజా.. సింపుల్ గా చెప్పాలంటే ఫ్లూ చికిత్సలో వాడుతున్నారు. ఆ మందు పనితీరుపై అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్), బ్రిటన్ లోని ప్లైమౌత్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు. కరోనా సోకడానికి 12 గంటల ముందు, కరోనా వచ్చిన 12 గంటల తర్వాత ఆ మందును ఎలుకలకు ఇచ్చి చూశారు. మహమ్మారి వైరస్ నుంచి మోల్నుపిరావిర్ మంచి రక్షణ కల్పించినట్టు గుర్తించారు.

ఆ మందును ఒక్కదాన్నే ఇచ్చినా, లేదా ఇతర యాంటీ వైరల్ మందులతో కలిపి ఇచ్చినా కరోనాను సమర్థంగా అడ్డుకుంటుందని తేల్చారు. ఎలుకల మీద సత్ఫలితాలనిచ్చిన ఈ ఔషధాన్ని మనుషులపైనా ప్రయోగించి చూస్తున్నారు. ఇప్పుడు ఆ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ తుది దశలో ఉన్నాయి. త్వరలోనే వాటి ఫలితాలను వెల్లడించనున్నారు. ఎలుకల్లో వచ్చిన ఫలితాలే మనుషులపైనా వస్తే కరోనాకు మరో అస్త్రం దొరికినట్టేనని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

పేటెంట్ కు భారత సంస్థ దరఖాస్తు

అంత మంచి ఫలితాలనిస్తున్న ఔషధ తయారీపై భారత సంస్థ పేటెంట్ కు దరఖాస్తు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన ఫెర్మెంటా బయోటెక్ లిమిటెడ్ (ఎఫ్ బీఎల్) అనే సంస్థ.. మోల్నుపిరావిర్ ను సమర్థవంతమైన పద్ధతుల్లో తయారు చేసే ‘బయోకేటలైసిస్’ను అభివృద్ధి చేసింది. ఇది పర్యావరణహితమైన టెక్నాలజీ అని సంస్థ సీఈవో ప్రశాంత్ నగరే తెలిపారు. అంతేగాకుండా అతి తక్కువ ఖర్చుతో ఔషధాన్ని ఉత్పత్తి చేయొచ్చని ఆయన చెప్పారు.


More Telugu News