ముంబైపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన ఢిల్లీ

  • మందకొడి పిచ్‌పై ముంబై బ్యాటింగ్ ఢమాల్
  • ముంబై వెన్ను విరిచిన అమిత్ మిశ్రా
  • మరోమారు రాణించిన ధవన్
ఐపీఎల్‌లో భాగంగా గత రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ విజయం సాధించింది. రోహిత్ శర్మ సేన తమ ముందు ఉంచిన 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మరో ఐదు బంతులు మిగిలి ఉండగా నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. లక్ష్యం చిన్నదే అయినా పిచ్ మందకొడిగా ఉండడంతో చెమటోడ్చాల్సి వచ్చింది. ఈ విజయంతో ఢిల్లీ ఖాతాలోకి ఆరు పాయింట్లు చేరాయి.

ఓపెనర్ పృథ్వీషా (7) విఫలమైనా శిఖర్ ధవన్ మరోమారు క్రీజులో పాతుకుపోయి జట్టును విజయం దిశగా నడిపించాడు. 42 బంతుల్లో 5 పోర్లు, సిక్సర్‌తో 45 పరుగులు చేశాడు. స్మిత్ 33, లలిత్ యాదవ్ 22 (నాటౌట్), కెప్టెన్ రిషభ్ పంత్ 7, హెట్మెయిర్ 14 (నాటౌట్) పరుగులు చేశారు. దీంతో మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ జట్టు విజయాన్ని అందుకుంది. ముంబై బౌలర్లలో జయంత్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, రాహుల్ చాహర్, కీరన్ పోలార్డ్ చెరో వికెట్ తీసుకున్నారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్ అమిత్ మిశ్రా మాయాజాలంతో ముంబై త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. నాలుగు వికెట్లు తీసిన మిశ్రా ముంబైని కోలుకోలేని విధంగా దెబ్బతీశాడు. అవేష్ ఖాన్ రెండు వికెట్లు తీసి అతడికి సహకరించాడు.

ముంబై జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ (44), సూర్యకుమార్ యాదవ్ (24), ఇషాన్ కిషన్ (25), జయంత్ యాదవ్ (23) మాత్రమే పరవాలేదనిపించారు. జట్టులో ఏడుగురు ఆటగాళ్లు పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోయారు. నాలుగు వికెట్లు తీసి జట్టు విజయానికి కారకుడైన ఢిల్లీ బౌలర్ అమిత్ మిశ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. నేడు పంజాబ్ కింగ్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది.


More Telugu News