బలమైన ముంబయి ఇండియన్స్ కు కళ్లెం వేసిన ఢిల్లీ బౌలర్లు

  • చెన్నైలో ముంబయి ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి
  • హడలెత్తించిన ఢిల్లీ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా
  • 4 వికెట్లతో ముంబయి పనిబట్టిన వైనం
ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ అత్యంత బలమైనదనడంలో సందేహంలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ నుంచి మొదలుపెడితే సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, పొలార్డ్, పాండ్యా బ్రదర్స్ తో ఎంతో పటిష్ఠంగా ఉంటుంది. కానీ, యువ రిషబ్ పంత్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో ముంబయి బ్యాటింగ్ తేలిపోయింది.

చెన్నైలో జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 44 పరుగులు చేయగా, ఇషాన్ కిషన్ 26, సూర్యకుమార్ 24, జయంత్ యాదవ్ 23 పరుగులు నమోదు చేశారు. ఢిల్లీ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 24 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఆవేశ్ ఖాన్ కు 2 వికెట్లు దక్కగా, స్టొయినిస్, రబాడా, లలిత్ యాదవ్ తలో వికెట్ తీశారు.

ఈ ఇన్నింగ్స్ లో హైలైట్ అంటే అమిత్ మిశ్రా బౌలింగేనని చెప్పాలి. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్, గూగ్లీలు, ఫ్లిప్పర్లతో ముంబయి బ్యాట్స్ మెన్ కు పరీక్ష పెట్టాడు. మిశ్రా ధాటికి రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య (0), కీరన్ పొలార్డ్ (2) పెవిలియన్ చేరారు. భారీ స్కోరు సాధించాలని భావించిన ముంబయి... మిశ్రా దెబ్బకు స్వల్పస్కోరుకే పరిమితమైంది.


More Telugu News