10 రోజుల్లో ఇండియాకు రానున్న స్పుత్నిక్ వ్యాక్సిన్!

  • ఇండియాలో కూడా తయారుకాబోతున్న స్పుత్నిక్ వ్యాక్సిన్
  • ప్రతి నెలా 5 కోట్ల డోసుల ఉత్పత్తి
  • 97.6 శాతం సామర్థ్యం ఉన్నట్టు తెలిపిన సంస్థ 
దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ఊపందుకుంది. తొలి రోజుల్లో వ్యాక్సిన్ వేయించుకోవడానికి భయపడ్డ జనాలు... ఇప్పుడు తమంతట తాముగా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో, వ్యాక్సిన్ కొరత కూడా పలు ప్రాంతాల్లో నెలకొంది.

దీనిని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం రష్యా నుంచి స్పుత్నిక్ వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకుంటోంది. మరో 10 రోజుల్లో స్పుత్నిక్ వ్యాక్సిన్ మన దేశానికి వస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ టీకా ఇండియాలో కూడా తయారుకాబోతోందని... ప్రతి నెలా 5 కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ వాడుతున్నారు. టీకా కొరత నేపథ్యంలో, స్పుత్నిక్ వ్యాక్సిన్ కు కేంద్రం అత్యవసర అనుమతులు మంజూరు చేసింది.

స్పుత్నిక్ వ్యాక్సిన్ తయారీ కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ టీకా ఇండియా-రష్యా వ్యాక్సిన్ గా మారుతుందని... రష్యా కంటే ఇండియాలోనే వ్యాక్సిన్ ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుందని ఆర్డీఐఎఫ్ సీఈఓ కిరిల్ దిమిత్రేవ్ తెలిపారు. ఐదు భారతీయ ఫార్మా కంపెనీలు తమ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేస్తాయని చెప్పారు.

మరోవైపు, స్పుత్నిక్ టీకా 97.6 శాతం పని చేస్తున్నట్టు గమేలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. ఇప్పటి వరకు నాలుగు కోట్ల మందికి స్పుత్నిక్ వ్యాక్సిన్ ఇచ్చారని... వారిలో కేవలం 0.027 శాతం మందికి మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చిందని వెల్లడించింది. ఇదే సమయంలో లాన్సెట్ జర్నల్ తన నివేదికలో స్పుత్నిక్ వ్యాక్సిన్ సామర్థ్యం 91.6 శాతంగా ఉన్నట్టు పేర్కొంది.


More Telugu News