అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తమిళనాడు సీఎంకు శస్త్రచికిత్స

  • తీవ్ర కడుపునొప్పికి గురైన సీఎం పళనిస్వామి
  • చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరిక
  • వైద్య పరీక్షలు నిర్వహించిన ఆసుపత్రి సిబ్బంది
  • హెర్నియాతో బాధపడుతున్నట్టు గుర్తింపు
తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామికి వైద్యులు హెర్నియా శస్త్రచికిత్స నిర్వహించారు. నిన్న తీవ్రమైన కడుపునొప్పి రావడంతో సీఎం పళనిస్వామి చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. భార్యతో కలిసి ఆసుపత్రికి వచ్చిన సీఎం పళనిస్వామికి వైద్య పరీక్షలు నిర్వహించిన ఆసుపత్రి సిబ్బంది, ఆయన హెర్నియాతో బాధపడుతున్నట్టు గుర్తించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటి నుంచి సీఎం పళనిస్వామి తన స్వగ్రామంలోనే ఉన్నారు. ఆదివారం చెన్నై చేరుకున్న ఆయన రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, నివారణ, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై సమీక్ష చేపట్టారు. ఈ సమావేశం సందర్భంగా ఆరోగ్యంగానే కనిపించిన సీఎం... ఆ తర్వాత కడుపునొప్పితో బాధపడ్డారు. కాగా, ఆసుపత్రిలో చేరిన వెంటనే ఆయనకు కొవిడ్ టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షలో ఆయనకు కరోనా లేదని నిర్ధారణ అయింది. అనంతరం హెర్నియా శస్త్రచికిత్స నిర్వహించారు.


More Telugu News