ఏపీపై కరోనా పంజా... మరో 27 మంది మృతి

  • ఒక్క కృష్ణా జిల్లాలోనే ఆరుగురి బలి
  • చిత్తూరు జిల్లాలో నలుగురి మృతి
  • 7,437కి పెరిగిన కరోనా మరణాలు
  • గత 24 గంటల్లో 37,765 కరోనా పరీక్షలు
  • 5,963 మందికి పాజిటివ్
  • 48 వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య
ఏపీలో కరోనా మహమ్మారి ప్రాణాంతక రీతిలో విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ లోనూ భారీ సంఖ్యలో ప్రాణాలను బలిగొంటోంది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 27 మంది కరోనాకు బలయ్యారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో ఆరుగురు మరణించగా, చిత్తూరు జిల్లాలో నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 7,437కి పెరిగింది.

గత 24 గంటల్లో 37,765 కరోనా పరీక్షలు నిర్వహించగా 5,963 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,182 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు తర్వాత అధిక కేసులు గుంటూరు (938), శ్రీకాకుళం (893), తూర్పు గోదావరి (626), విశాఖ (565) జిల్లాల్లో గుర్తించారు. అత్యల్పంగా విజయనగరంలో 19, పశ్చిమ గోదావరిలో 19 కేసులు వెల్లడయ్యాయి.

ఇప్పటివరకు ఏపీలో 9,68,000 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 9,12,510 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 48,053 మందికి చికిత్స జరుగుతోంది.


More Telugu News