చితక్కొట్టిన శిఖర్ ధవన్.. భారీ స్కోరును అలవోకగా ఛేదించిన ఢిల్లీ

  • సెంచరీ చేజార్చుకున్న ధవన్
  • రెండో స్థానంలో ఢిల్లీ కేపిటల్స్
  • పంజాబ్‌కు రెండో పరాజయం
ఐపీఎల్‌లో భాగంగా గత రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 196 పరుగుల విజయ లక్ష్యాన్ని 10 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో నాలుగు పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు కెప్టెన్ రాహుల్, మయాంక్ అగర్వాల్ జోడీ గట్టి పునాది వేసింది. రాహుల్ 51 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు చేయగా, అగర్వాల్ మరింత దూకుడుగా ఆడాడు. 36 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 69 పరుగులు చేశాడు. గేల్ (11) మరోమారు నిరాశ పరచగా, పూరన్ 9 పరుగులు మాత్రమే చేశాడు. దీపక్ హుడా (22), షారూక్ ఖాన్ (15) నాటౌట్‌గా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, మెరివాలా, రబడ, అవేశ్ ఖాన్‌లు చెరో వికెట్ తీసుకున్నారు.

అనంతరం 196 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ.. శిఖర్ ధవన్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలవోక విజయాన్ని అందుకుంది. కేవలం 49 బంతుల్లోనే 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 92 పరుగులు చేసి 8 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. పృథ్వీషా 32, స్మిత్ 9, రిషభ్ పంత్ 15, స్టోయినిస్ 27, లలిత్ యాదవ్ 12 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో జే రిచర్డ్‌సన్ 2 వికెట్లు తీయగా, అర్షదీప్, మెరిడిత్ చెరో వికెట్ తీసుకున్నారు. మూడు మ్యాచ్‌లు ఆడిన పంజాబ్‌కు ఇది వరుసగా రెండో పరాజయం.

ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన శిఖర్ ధవన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఐపీఎల్‌లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ముంబైలో మ్యాచ్ జరగనుంది.


More Telugu News