కరోనా ఉన్నా బంగారంపై తగ్గని భారతీయుల మోజు!

  • 2021-22లో 22.58 శాతం పెరిగిన దిగుమతులు
  • దేశీయంగా గిరాకీ పెరగడమే ప్రధాన కారణం
  • తగ్గిన వెండి దిగుమతులు
  • కుంగిన వాణిజ్య లోటు
గత ఆర్థిక సంవత్సరాన్ని కరోనా కుదిపేసినా భారతీయులకు పుత్తడిపై మోజు మాత్రం తగ్గలేదు. బంగారం దిగుమతులు గత ఏడాది 22.58 శాతం పెరిగి 34.6 బిలియన్‌ డాలర్లకు చేరాయని కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది. దేశంలో పసిడికి గిరాకీ పెరగడమే దిగుమతులకు ప్రధాన కారణమని కేంద్రం తెలిపింది. అయితే, వెండి దిగుమతుల్లో మాత్రం 71 శాతం తగ్గుదల నమోదైంది. బంగారం దిగుమతులు కరెంటు ఖాతా లోటుపై నేరుగా ప్రభావం చూపుతాయి.

బంగారం దిగుమతులు పెరిగినప్పటికీ.. వాణిజ్య లోటు మాత్రం తగ్గడం విశేషం. 2019-20లో 161.3 బిలియన్‌ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు 2020-21లో 98.56 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. పెళ్లిళ్ల సీజన్‌, అక్షయ తృతీయను పురస్కరించుకొని రానున్న రోజుల్లో దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది.

అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకుంటున్న దేశాల జాబితాలో భారత్‌దే తొలి స్థానం. ఆభరణాల తయారీకే ఎక్కువగా పసిడిని వాడుతుంటారు. భారత్‌ ఏటా 800-900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. బంగారం దిగుమతులపై ఉన్న సుంకాన్ని గత బడ్జెట్‌లో కేంద్రం 12.5 శాతం నుంచి 10 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే.


More Telugu News