వ్యాక్సినేషన్‌ వేగవంతం చేస్తేనే మహమ్మారికి అడ్డుకట్ట: మోదీకి మన్మోహన్‌ సూచనలు

  • ఇప్పటి వరకు ఎన్ని  టీకాలు ఆర్డర్‌ చేశారో చెప్పాలి
  • ఫ్రంట్‌లైన్‌ వర్కర్లను గుర్తించే వెసులుబాటు రాష్ట్రాలకు కల్పించాలి
  • టీకా తయారీ సంస్థలకు అండగా ఉండాలి
  • రాష్ట్రాలకు ఎలా పంచనున్నారో ముందే తెలియజేయాలి
  • మోదీకి రాసిన లేఖలో మన్మోహన్‌ సింగ్‌ వ్యాఖ్యలు
దేశంలో కరోనా రెండో దఫా విజృంభిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రధాని నరేంద్ర మోదీకి కొన్ని సూచనలు చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ లేఖ రాశారు. కరోనాను నివారించాలంటే వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడమే మేలైన మార్గమని సూచించారు. అలాగే ఇప్పటి వరకు ఎన్ని వ్యాక్సిన్లు, ఏయే సంస్థల వద్ద ఆర్డర్‌ చేశారో తెలియజేయాలని కోరారు.

అలాగే స్థానిక పరిస్థితులను బట్టి ఫ్రంట్‌లైన్‌ వర్కర్లను గుర్తించే వెసులుబాటు రాష్ట్రాలకు కల్పించాలని మన్మోహన్‌ లేఖలో సూచించారు. ఫలితంగా కొవిడ్‌ ముప్పు ఉన్న మరికొంత మందికి సైతం వ్యాక్సిన్‌ అందే అవకాశం ఉంటుందన్నారు.

వ్యాక్సిన్‌ తయారీ సంస్థలకు కేంద్రం అండగా నిలవాలని మన్మోహన్‌ సూచించారు. అందులో భాగంగా నిధులు, రాయితీల రూపంలో ప్రోత్సాహం అందించాలన్నారు.  ఏయే సంస్థల వద్ద ఎన్ని టీకాలు ఆర్డర్‌ చేశారో ప్రజలకు తెలియజేయాలన్నారు. అలాగే రానున్న ఆరు నెలల్లో ఎన్ని టీకాలు అందబోతున్నాయి.. అవి ఏయే రాష్ట్రాలకు ఎలా పంచనున్నారో కూడా ముందే తెలియజేయాలన్నారు. దీనివల్ల రాష్ట్రాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు.


More Telugu News