తల్లులకు అంత్యక్రియలు జరిపి వెంటనే విధులకు హాజరైన వైద్యులు... కరోనా కాలంలో స్ఫూర్తిదాయకం!

  • దేశంలో కరోనా ఉద్ధృతం
  • విరామం లేకుండా పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది
  • గుజరాత్ లో నిబద్ధతకు మారుపేరులా ఇద్దరు వైద్యులు
  • బంధాల కంటే విధులకే ప్రాధాన్యత
వైద్య వృత్తి ఎంత విలువైనదో, బాధ్యతాయుతమైనదో  గుజరాత్ కు చెందిన ఈ ఇద్దరు వైద్యులు నిరూపించారు. తమ తల్లులను కోల్పోయినా, తీవ్ర భావోద్వేగాలను సైతం అదుపు చేసుకుని, తల్లుల అంత్యక్రియలు పూర్తయిన వెంటనే మళ్లీ విధులకు హాజరై స్ఫూర్తిదాయకంగా నిలిచారు. వడోదర ప్రాంతానికి చెందిన డాక్టర్ శిల్పా పాటిల్ తల్లి కాంతా అంబాలాల్ పాటిల్ (77) వారం రోజుల పాటు కరోనాతో పోరాడి మృత్యువాత పడ్డారు. అయితే, తల్లి మరణంతో డాక్టర్ శిల్పా పాటిల్ కుంగిపోకుండా, తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించారు. తల్లి అంత్యక్రియలు ముగిసిన వెంటనే నేరుగా ఆసుపత్రికి వచ్చి తన విధుల్లో కొనసాగారు.

అటు, గాంధీనగర్ కు చెందిన డాక్టర్ రాహుల్ పర్మార్ కూడా ఇదే రీతిలో తన నిబద్ధతను చాటుకున్నారు. ఆయన తల్లి వృద్ధాప్య సంబంధ సమస్యలతో కన్నుమూశారు. దాంతో డాక్టర్ రాహుల్ పర్మార్ కొన్ని గంటల పాటు తన విధులకు దూరమై తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆపై మరేమీ ఆలస్యం చేయకుండా తిరిగి తన విధులకు హాజరయ్యారు. డాక్టర్ పర్మార్ గుజరాత్ లోనే అతిపెద్ద ఆసుపత్రిలో కొవిడ్ మేనేజ్ మెంట్ విభాగం నోడల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. దేశమంతా కరోనాతో అతలాకుతలం అవుతుంటే తాము విధులు నిర్వర్తించడం ఎంతో అవసరమని ఆ వైద్యులు వినమ్రంగా తెలిపారు.


More Telugu News