దేశంలో కరోనా వ్యాప్తికి ప్రధాన కారణాలు ఇవే: ఎయిమ్స్ చీఫ్

  • భారత్ లో నిత్యం లక్షల్లో కరోనా కేసులు
  • గత 24 గంటల్లో 2.34 లక్షల పాజిటివ్ కేసులు
  • వెయ్యికి పైగా మరణాలు
  • ప్రజలు కరోనా మార్గదర్శకాలు పాటించడంలేదన్న గులేరియా
  • వైరస్ రూపాంతరం చెందుతోందని వెల్లడి
భారత్ లో గడచిన 24 గంటల్లో 2.34 లక్షల కరోనా పాజిటివ్ కేసులు రావడం అత్యంత ఆందోళన కలిగిస్తోంది. అదే సమయంలో వెయ్యికి పైగా మరణాలు సంభవించాయి. గత కొన్నిరోజులుగా కేసుల ఉద్ధృతి క్రమంగా పెరుగుతూ వస్తోంది. దీనిపై ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా స్పందించారు. కేంద్రం జారీ చేసిన కొవిడ్ మార్గదర్శకాలను ప్రజలు పాటించకపోవడం, రూపు మార్చుకున్న వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం దేశంలో కేసుల పెరుగుదలకు ప్రధాన కారణాలని వెల్లడించారు.

వ్యాక్సినేషన్ జరుగుతోందన్న ధీమాతో ప్రజలు ఎంతో నిర్లక్ష్యంగా ఉంటున్నారని వివరించారు. కరోనా విస్తరిస్తుంటే దేశంలో మత సంబంధ కార్యక్రమాలు, ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి ఎన్నికలు, మత కార్యక్రమాలను ఆంక్షలు పాటిస్తూ జరుపుకోవాలని సూచించారు.

వ్యాక్సినేషన్ వయోపరిమితిని సడలిస్తూ వెళ్లాలని, తద్వారా అత్యధికులకు వ్యాక్సిన్ అందించేందుకు వీలవుతుందని తెలిపారు. ఉత్తరాఖండ్ లో ముగిసిన కుంభమేళాకు నిత్యం లక్షల మంది విచ్చేసిన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశంలో కరోనా వ్యాప్తికి కుంభమేళా కారణమయ్యే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి.


More Telugu News