ఆ కఠిన పరిస్థితులలో సైతం ఆశను కోల్పోలేదు: మావోయిస్టుల చెర నుంచి విడుదలైన సీఆర్పీఎఫ్ జవాను

  • ఐదు రోజుల పాటు మావోయిస్టుల చెరలో ఉన్న రాకేశ్వర్
  • స్వగ్రామానికి చేరుకున్న రాకేశ్వర్ కు ఘనస్వాగతం 
  • తన తల్లి ప్రార్థనలే తనను కాపాడాయన్న రాకేశ్వర్
ఈ నెల 3న ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో 22 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే సమయంలో సీఆర్పీఎఫ్ కమెండో రాకేశ్వర్ మన్హాస్ ను మావోయిస్టులు తమతో పాటు బందీగా తీసుకెళ్లారు. దాదాపు ఐదు రోజుల పాటు రాకేశ్వర్ మావోయిస్టుల చెరలో ఉన్నారు. ఆ తర్వాత ఆయనను మావోలు విడుదల చేశారు.

నిన్ననే రాకేశ్వర్ తన హోమ్ టౌన్ జమ్మూకు చేరుకున్నారు. జమ్ము నగర శివార్లలో ఉన్న తన స్వగ్రామం బర్నీలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మావోయిస్టుల చెరలో ఉన్నప్పటికీ తాను జీవితంపై ఆశను కోల్పోలేదని చెప్పారు. అలాంటి కఠిన పరిస్థితులలో కూడా ప్రశాంతంగా వున్నానని అన్నారు.

 శత్రువుల చెరలో ఉన్న తనను తన తల్లి ప్రార్థనలే కాపాడాయని తెలిపారు. తనను మావోలు విడుదల చేస్తారా? లేదా? అనే విషయం తనకు తెలియదని... అయితే నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదని చెప్పారు. తన ఈ రెండవ జన్మను తన తల్లికే ఇస్తున్నానని తెలిపారు. మావోల చెరలో ఉన్నవారు ఇంత వరకు ఎవరూ తిరిగి రాలేదని... తన తల్లి ప్రార్థనలే తనను కాపాడాయని చెప్పారు.

రాకేశ్వర్ తల్లి కుంతిదేవి మాట్లాడుతూ, తన కుమారుడిని సురక్షితంగా విడిపించాలని మాతా వైష్ణోదేవిని ప్రార్థించానని తెలిపారు. తన ప్రార్థనలను వైష్ణోదేవి మాత విన్నదని... తన కుమారుడిని విడిపించిందని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులతోనే తన కొడుకు క్షేమంగా తిరిగొచ్చాడని అన్నారు.

రాకేశ్వర్ భార్య ముని మాట్లాడుతూ, తన భర్త జీవితంలోని చెడు కాలం ముగిసిపోయిందని చెప్పారు. తర భర్త తిరిగిరావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తమ కుటుంబంతో పాటు వందలాది మంది చేసిన ప్రార్థనల వల్లే ఆయన తిరిగొచ్చారని చెప్పారు. తన భర్త విడుదల కావాలని కోరుకున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు, రాకేశ్వర్ ను చూసి తామంతా గర్వపడుతున్నామని గ్రామస్థులు చెప్పారు.


More Telugu News