ఇలా ఆడితే నేనేం చెప్పగలను?: కేఎల్ రాహుల్ నిర్వేదం!

  • నిన్నటి మ్యాచ్ లో పంజాబ్ ఓటమి
  • పిచ్ ఏ మాత్రమూ డ్రైగా లేదు
  • మరో 50 పరుగులన్నా చేయాల్సింది
  • క్రెడిట్ అంతా చెన్నై బౌలర్లదేనన్న కేఎల్ రాహుల్
శుక్రవారం రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో పేలవమైన ప్రదర్శన కనబరిచిన పంజాబ్ కింగ్స్, దారుణ ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ నిర్వేదాన్ని వ్యక్తం చేశాడు.

ఇటువంటి ఆటను సాధ్యమైనంత త్వరగా మరచిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నాడు. తన జట్టు ఆటగాళ్లు మైదానంలో చూపిన ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన రాహుల్, ఈ పిచ్ బ్యాటింగ్ కు ఎంత మాత్రమూ అనుకూలించలేదని అన్నాడు. తమ ఆటగాళ్లు ఆడిన ఆటపై మాట్లాడేందుకు ఏమీ లేదని, తాను కూడా ఏమీ వ్యాఖ్యానించలేనని అన్నాడు.

పిచ్ అసలు డ్రైగా లేదని, తొలుత జిగటగా కనిపించిందని, అలాగే ఏ మాత్రమూ మారకుండా ఉందని అన్నాడు. ఈ పిచ్ ని చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు సద్వినియోగం చేసుకున్నారని, క్రెడిట్ మొత్తం వారిదేనని అన్నాడు. తాము ఆడుతున్న సమయంలో వారు సరైన ప్రాంతాల్లో బంతులు వేశారని, ముఖ్యంగా దీపక్ చాహర్ తన నకుల్  బంతులతో వికెట్లు సాధించాడని అన్నారు.

తాను రన్నౌట్ కావడం జట్టుకు భారీ నష్టాన్ని కలిగించిందని, ఈ పిచ్ పై సాధారణంగా ఆడినా 150 నుంచి 160 పరుగలు చేయవచ్చని, కానీ తాము చాలా తక్కువకే పరిమితం అయ్యామని కేఎల్ రాహుల్ వ్యాఖ్యానించాడు.ఈ మ్యాచ్ ని గుణపాఠంగా తీసుకుంటామని, ఇకపై ఆడే మ్యాచ్ లలో మరింత జాగ్రత్తగా ఆడుతామని, తరువాతి మ్యాచ్ లకు పేస్ విభాగంతో రెడీ అవుతామని అన్నారు.


More Telugu News