కరోనాతో సీబీఐ మాజీ డైరెక్టర్​ రంజిత్​ సిన్హా మృతి

  • నిన్న రాత్రే పాజిటివ్ అని నిర్ధారణ
  • ఇవ్వాళ తెల్లవారుజామున కన్నుమూత
  • కోల్ స్కామ్, 2జీ స్కామ్ ల వివాదాలు మెడకు
  • దర్యాప్తును ప్రభావితం చేశారన్న ఆరోపణలు
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా కరోనాతో మృతి చెందారు. గురువారం రాత్రే ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయితే, తెల్లవారేసరికి ఆయన మహమ్మారి కారణంగా చనిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఆయన కన్నుమూశారు.

1974 బీహార్ కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన ఆయన 2012 నుంచి 2014 మధ్య సీబీఐ డైరెక్టర్ గా పనిచేశారు. ఆయన పదవీ కాలంలో ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు. ఇష్రత్ జహాన్ ఎన్ కౌంటర్ కేసుకు సంబంధించి నిఘా విభాగంతో ఘర్షణలూ పడ్డారు. బొగ్గు బ్లాకుల కేటాయింపుల కుంభకోణం, 2జీ కుంభకోణాలకు సంబంధించి కూడా ఆయన వివాదాలకు కేంద్ర బిందువయ్యారు.

ఆయన డైరెక్టర్ గా ఉన్నన్నాళ్లూ కోల్ స్కామ్ దర్యాప్తును ప్రభావితం చేశారన్న ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత 2జీ స్కామ్ నిందితులు ఆయన ఆఫీసుకు వచ్చి వెళ్లేవారనీ తేలింది. 2012 యూపీఏ హయాంలో ‘కోల్ గేట్’గా పిలిచిన బొగ్గు కుంభకోణం ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే.


More Telugu News