ఇప్పుడు విరమించి.. కావాలంటే తర్వాత చేసుకోండి: ఉద్యమ రైతులకు హర్యానా సీఎం ఖట్టర్ విజ్ఞప్తి

  • ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఉద్యమం సరికాదు
  • మానవతా దృక్పథంతో ఆందోళన విరమించండి
  • నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల వద్ద రైతులు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదంటున్న రైతులు ప్రభుత్వంపై దీర్ఘకాలిక పోరుకు సిద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ స్పందించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆందోళన కొనసాగించడం సరికాదని, మానవతా దృక్పథంతో ఉద్యమాన్ని తాత్కాలికంగానైనా విరమించాలని విజ్ఞప్తి చేశారు.

నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉన్నప్పటికీ ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో మాత్రం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సరికాదని, కాాబట్టి రైతులు తమ ఆందోళనను విరమించాలని కోరారు. కావాలంటే వైరస్ వ్యాప్తి తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొన్నాక మళ్లీ ఆందోళనలు చేపట్టుకోవచ్చని సీఎం ఖట్టర్ రైతులకు సూచించారు.


More Telugu News