జడ్జి రామకృష్ణపై దేశద్రోహం కేసు.. పీలేరులో అరెస్ట్.. రిమాండ్

  • జగన్‌పై ప్రజల్లో ద్వేషం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు
  • ఆసుపత్రికి వెళ్తుండగా అడ్డుకుని అరెస్ట్
  • జగన్, మంత్రి పెద్దిరెడ్డిపై రామకృష్ణ కుమారుడు ఆగ్రహం
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేస్తూ ప్రజల్లో ద్వేషం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సస్పెండైన న్యాయమూర్తి రామకృష్ణపై  చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన జయరామచంద్రయ్య బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేశద్రోహం కేసు నమోదు చేసిన పోలీసులు నిన్న ఆయనను అరెస్ట్ చేశారు.

కరోనా పరీక్షల కోసం రామకృష్ణ నిన్న మధ్యాహ్నం మదనపల్లె వెళ్తుండగా పీలేరు ఎన్డీఆర్ కూడలి వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీఐ కార్యాలయానికి తరలించి అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించి మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. 14 రోజుల రిమాండ్ విధించడంతో పీలేరు సబ్‌జైలుకు రామకృష్ణను తరలించారు.

కాగా, నాలుగు రోజుల క్రితం ఓ టీవీ చర్చలో పాల్గొన్న జడ్జి రామకృష్ణ.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కంసుడితో పోల్చారని,  నరకాసురుడు, కంసుడు అయిన జగన్‌ను ఎప్పుడు శిక్షించాలా? అని ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారంటూ జయరామచంద్రయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు రామకృష్ణను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

రామకృష్ణ అరెస్ట్‌ను ఆయన కుమారుడు వంశీకృష్ణ ఖండించారు. జ్వరానికి చికిత్స చేయించుకుని వస్తానన్నా వినిపించుకోకుండా తన తండ్రిని పోలీసులు లాక్కెళ్లి మరీ అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రికి ఏమైనా జరిగితే ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్, మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు బాధ్యత వహించాల్సి ఉంటుందని వంశీకృష్ణ హెచ్చరించారు.


More Telugu News