పశ్చిమ బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌ ప్రచారంపై 24 గంటల నిషేధం!

  • ఈరోజు రాత్రి 7 గంటల నుంచి నిషేధం అమల్లోకి
  • సీతల్‌కూచి ఘటనను ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు
  • ఈసీకి ఫిర్యాదు చేసిన తృణమూల్‌
  • రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని ఈసీ హెచ్చరిక
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ ప్రచారంపై ఎన్నికల సంఘం 24 గంటల నిషేధం విధించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ఓ చోట మాట్లాడుతూ.. ‘‘ రాష్టంలో పలు ప్రాంతాల్లో సీతల్‌కూచి తరహా ఘటనలు జరుగుతాయి’’ అంటూ చేసిన వ్యాఖ్యలను ఈసీ తీవ్రంగా పరిగణించింది. మరోసారి ఈ తరహా వ్యాఖ్యలు చేయొద్దని తీవ్రంగా హెచ్చరించింది.

దిలీప్‌ ఘోష్‌ ప్రచారంపై విధించిన నిషేధం ఈరోజు రాత్రి 7 గంటల నుంచి రేపు రాత్రి 7 గంటల వరకు అమల్లో ఉండనుంది. ఘోష్‌ వ్యాఖ్యలపై తృణమూల్‌ కాంగ్రెస్‌ ఫిర్యాదు చేయగా.. మంగళవారమే ఆయనకు ఈసీ నోటీసులు జారీ చేసింది.

నాలుగో విడత పోలింగ్‌ సందర్భంగా సీతల్‌కూచి పోలింగ్‌ బూత్‌ పరిధిలో పలువురు దుండగులు కేంద్ర బలగాలపై దాడికి యత్నించారు. ఈ క్రమంలో భద్రతా బలగాల తుపాకులను లాక్కునేందుకు యత్నించగా.. గత్యంతరం లేని పరిస్థితుల్లో పోలీసులు కాల్పులకు దిగారు. ఈ క్రమంలో నలుగురు మృతి చెందగా.. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే, పోలీసులపైకి దాడికి యత్నించింది తృణమూల్‌ వారేనని బీజేపీ ఆరోపిస్తోంది.

 ఈ ఘటనను ఉద్దేశిస్తూ ఘోష్‌ ఓ ప్రచార సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది ఆరంభం మాత్రమే. కేంద్ర బలగాల తుపాకులు కేవలం ప్రదర్శనకు మాత్రమేనని ఎవరైతే భావించారో.. వారికి వాటి శక్తి ఏంటో తెలిసొచ్చింది. చాలా ప్రాంతాల్లో సీతల్‌కూచి తరహా ఘటనలు జరగొచ్చు. ఎవరైతే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుందామని ప్రయత్నిస్తారో వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలనే తాజాగా ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది.


More Telugu News