జగన్ పేరును నిలబెట్టేలా వాలంటీర్లు పని చేయాలి!: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

  • అర్హులందరికీ పథకాలు అందాలనే వాలంటీర్ వ్యవస్థను జగన్ తెచ్చారు
  • వాలంటీర్ వ్యవస్థను ఇతర రాష్ట్రాలు కూడా మెచ్చుకుంటున్నాయి
  • చంద్రబాబు మాత్రం వాలంటీర్లను అవమానిస్తున్నారు
టీడీపీ ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలు సొంత పార్టీ వ్యక్తులకే అనుకూలంగా పని చేశాయని... ఇతర పార్టీలకు చెందిన అర్హులకు అందాల్సిన పథకాలు అందకుండా చేశాయని ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ నేరుగా అందాలనే మంచి సంకల్పంతో వాలంటీర్ వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్ తీసుకొచ్చారని అన్నారు. కుల, మత, పార్టీల తారతమ్యం లేకుండా అర్హులందరికీ పథకాలు అందాలని జగన్ చెప్పారని తెలిపారు. జగన్ పేరును నిలబెట్టేలా వాలంటీర్లు పని చేయాలని చెప్పారు.

కరోనా సమయంలో ప్రాణాలను కూడా లెక్కచేయకుండా వాలంటీర్లు పని చేశారని వెల్లంపల్లి కితాబునిచ్చారు. వాలంటీర్ల పనితీరు ఇతర రాష్ట్రాలు కూడా మెచ్చుకునేలా ఉందని చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రధాని మోదీకి కూడా జగన్ లేఖ రాశారని తెలిపారు. ఇంతకు ముందు ఒక వ్యక్తి చనిపోతేనే మరొకరికి పింఛను వచ్చేదని... ఆ విధానానికి జగన్ స్వస్తి పలికారని చెప్పారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబు వాలంటీర్లను అవమానిస్తున్నారని మండిపడ్డారు.

వాలంటీర్లు అంటే గుమాస్తాలు కాదని.. ప్రజాసేవకులని వెల్లంపల్లి చెప్పారు. ప్రజలకు వాలంటీర్లు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్ మిమ్మల్ని పురస్కారాలతో సత్కరిస్తున్నారని తెలిపారు. చివరి వ్యక్తి వరకు కూడా లబ్ధి చేకూరే విధంగా వాలంటీర్లు పని చేయాలని సూచించారు.


More Telugu News