మా రాష్ట్రానికి కరోనాను తీసుకొచ్చి పారిపోతున్నారు: మమతా బెనర్జీ ఫైర్

  • కరోనా లేనప్పుడు బెంగాల్ కు ఒక్కరు కూడా రాలేదు
  • ఇప్పుడు ఎన్నికల కోసం వస్తున్నారు
  • సరైన సమయంలో వ్యాక్సిన్ ఇచ్చుంటే కరోనా ఉండేది కాదు
బీజేపీపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరోక్షంగా తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల ప్రచారం కోసం వందలాది మంది బయటి వారిని రాష్ట్రానికి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. బయట నుంచి కరోనా వైరస్ ను రాష్ట్రానికి తీసుకొచ్చి పారిపోతున్నారని అన్నారు. సరైన సమయంలో కోవిడ్ వ్యాక్సిన్ అందించి ఉంటే... ప్రస్తుత కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉండేది కాదని దుయ్యబట్టారు.

'ఇన్ని రోజులు మీరెక్కడ ఉన్నారు? రాష్ట్రానికి కరోనాను తీసుకొచ్చి పారిపోయారు. మేమే కరోనాను నియంత్రించాం. వారు సరైన సమయంలో అందరికీ వ్యాక్సిన్ ఇచ్చి ఉంటే... ఇప్పుడు కరోనా కేసులు ఉండేవి కాదు. వారు ఎంతో మంది బయటివారిని బెంగాల్ కు తీసుకొచ్చారు. ఎన్నికల ప్రచారం పేరుతో ఎందరినో తీసుకొచ్చి ఇక్కడ వైరస్ ను విస్తరింపజేసి పారిపోయారు. కరోనాను తీసుకురావడమే కాకుండా... మాకు ఓటు వేయండని అడుగుతున్నారు' అని మమత మండిపడ్డారు.

కరోనా ఎప్పుడైనా, ఎవరికైనా సోకుతుందని మమత అన్నారు. ప్రజలందరికీ సరైన వైద్య చికిత్స అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గతంలో ఇక్కడ కరోనా వున్నప్పుడు ఒక్కరు కూడా రాలేదని... ఇప్పుడు కేవలం ఎన్నికల కోసమే వస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ తనపై చేసిన విమర్శలకు మమత ఈ మేరకు కౌంటర్ ఇచ్చారు.

మమతా బెనర్జీ మూడున్నర గంటల పాటు గాంధీ బొమ్మను వేస్తూ కూర్చున్నారని... ఇదే సమయాన్ని వైద్యాధికారులతో సమీక్షకు వెచ్చించి ఉంటే ప్రజలకు మేలు జరిగేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జై ప్రకాశ్ మజుందార్ విమర్శించారు. రాష్ట్రానికి ఆరోగ్య మంత్రి కూడా ఆమే అని ఎద్దేవా చేశారు.


More Telugu News