కోహ్లీ, విలియమ్సన్ కలిస్తే రిషబ్ పంత్: రికీ పాంటింగ్ పొగడ్తలు

  • పంత్ ను చూస్తుంటే ఆనందం కలుగుతోంది
  • నాలుగు లేదా ఐదో స్థానాలు అచ్చొస్తాయి
  • కీపింగ్ ను మాత్రం మెరుగుపరచుకోవాలన్న పాంటింగ్
ఐపీఎల్ 14వ సీజన్ లో తొలి మ్యాచ్ లో సీఎస్కేను ఓడించిన ఢిల్లీ కాపిటల్స్, తన తదుపరి మ్యాచ్ ని రాజస్థాన్ రాయల్స్ తో ఆడనుంది. ఢిల్లీ కాపిటల్స్ జట్టుకు యువ ఆటగాడు రిషబ్ పంత్ సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీసీకి చీఫ్ కోచ్ గా ఉన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు రిషబ్ పంత్ ను చూస్తుంటే ఎంతో ఆనందం కలుగుతోందని అన్నాడు.

పంత్ లో తనకు ఇద్దరు ఆటగాళ్లు కనిపిస్తున్నారని విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్ ల కలయికే, రిషబ్ పంత్ అని పొగడ్తల వర్షం కురిపించాడు. కోహ్లీలోని దూకుడు, విలియమ్సన్ లోని నాయకత్వ లక్షణాలు పంత్ లో ఉన్నాయని కితాబునిచ్చాడు. అయితే, పంత్ ను ఎప్పుడు బ్యాటింగ్ కు పంపాలన్న విషయంలో తమకు పూర్తి స్పష్టత లేదని వ్యాఖ్యానించిన పాంటింగ్, పంత్ కు మాత్రం నాలుగు లేదా ఐదు స్థానాలు అచ్చొస్తాయని అభిప్రాయపడ్డాడు.

జట్టులోకి కీపర్ గా వచ్చిన పంత్ కొన్నిసార్లు తప్పులు చేస్తున్నాడని, ఈ విషయంలో మాత్రం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని సలహా ఇచ్చాడు. బ్యాటింగ్ పరంగా అద్భుతమైన ఫుట్ వర్క్ పంత్ సొంతమని, కీపింగ్ విషయంలోనూ నైపుణ్యాన్ని పెంచుకుంటే, కనీసం మరో పది లేదా పన్నెండేళ్లు భారత జట్టుకు ప్రధాన వికెట్ కీపర్ గా మారే అవకాశాలు ఉన్నాయని అన్నాడు. కాగా, ఢిల్లీ కాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కు గాయం అయి, ఐపీఎల్ సీజన్ కు దూరం కావడంతో, కెప్టెన్సీ బాధ్యతలు పంత్ భుజాలపైకి వచ్చిన సంగతి తెలిసిందే.


More Telugu News